BJP Candidates List: ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం సాయంత్రం భేటీ అయింది. ప్రధాని మోదీ హాజరైన ఈ సమావేశంలో హోమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నికలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయడం, గెలుపు కోసం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. నవంబర్ 3వ తేదీ నుంచి తెలంగాణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని స్థానాలను అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ రెడీ అయింది.


ఇప్పటికే తెలంగాణ ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి రెండు జాబితాలు ప్రకటించగా.. మూడో జాబితాలో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను  బీజేపీ ప్రకటించనుంది. ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో తుది జాబితాపై చర్చించనున్నారు. సభ్యులు ఆమోదం తెలిపిన తర్వాత ఏ క్షణమైనా టీ బీజేపీ మూడో జాబితా విడుదలయ్యే అవకాశముంది. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం జాబితాను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటివరకు 53 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మూడో జాబితాలో మిగిలి నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫిక్స్ చేయనున్నారు.


52 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేయగా.. రెండో జాబితాలో ఒకే పేరును మాత్రమే ప్రకటించింది. మిగిలిన 66 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. దీంతో ఏ క్షణమైనా బీజేపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఆశావాహులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. చివరి జాబితాలో తమకు సీటు దక్కుతుందో.. లేదో అనే ఆందోళనలో ఉన్నారు. నరాలు తెగే ఉత్కంఠతో తుది జాబితా కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ జాబితాతో జనసేనకు కేటాయించే టికెట్లపై కూడా క్లారిటీ రానుంది. తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు దాదాపు ఖరారు అయింది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా ఢిల్లీలో పవన్ భేటీ అయ్యారు. తెలంగాణలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించారు.


జనసేనకు 10 సీట్లు కేటాయించేందుకు బీజేపీ సిద్దమైనట్లు వార్తలొస్తున్నాయి.  కోదాడ, నాగర్ కర్నూల్, తాండూర్, గ్రేటర్ హైదరాబాద్‌లో కూకట్ పల్లితో పాటు మరో సీటు, వైరా, ఖమ్మం, అశ్వరావుపేట, కొత్తగూడెం సీట్లను జనసేనకు కేటాయించనున్నారని సమాచారం. ఇక శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ సీట్లను కూడా జనసేన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.  జనసేన 25 సీట్లను డిమాండ్ చేయగా.. బీజేపీ 10 మాత్రమే ఇచ్చేందుకు రెడీ అయింది. తొలుత ఒంటరిగా 30 నుంచి 35 స్థానాల్లో పోటీలోకి దిగాలని పవన్ కల్యాణ్ భావించారు. ఈ మేరకు అభ్యర్థులను కూడా ఖరారు చేసేందుకు జనసేన సిద్దమైంది. కానీ అనూహ్యంగా జనసేనను కలుపుకునేందుకు బీజేపీ రెడీ అయింది. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడం కూడా బీజేపీ, జనసేనకు కలిసొస్తుందని కొంతమంది విశ్లేషిస్తున్నారు. టీడీపీ పోటీలోకి దిగకపోవడం వల్ల సెటిలర్ ఓట్లు బీజేపీ, జనసేన వైపు మళ్లుతాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.