Rakesh Reddy Resign to BJP:
వరంగల్: తెలంగాణలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీ టికెట్ దక్కకపోవడంతో కీలక నేతలు వేరే పార్టీలోకి వెళ్తున్నారు. బీజేపీకి బుధవారం రెండు షాకులు తగిలాయి. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రాజీనామా బీజేపీకి రాజీనామా చేయడం తెలిసిందే. కొన్ని గంటల్లోనే మరో నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. రాష్ట్ర అధికార ప్రతినిధి గా కొనసాగుతున్న రాకేష్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. వరంగల్ పశ్చిమ టిక్కెట్ దక్కపోవడంతో రాకేష్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. తన కార్యకర్తలతో కలిసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పొమ్మనలేక పొగ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
నేటి ఉదయం మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేశారు. ఆయనతోపాటు కుమారుడు వంశీ కూడా బీజేపీకి గుడ్ బై చేశారు. గంటల వ్యవధిలోనే ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఫోన్‌లో మంతనాలు జరిపిన వివేక్.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నోవాటెల్ హోటల్‌లో బస చేసిన రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఆయనతోపాటు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం ఎంతగానో పనిచేసినా గుర్తింపు దక్కడం లేదన్నారు. తనకు అర్హత ఉందో లేదో చెక్ చేసిన తరువాత వరంగల్ పశ్చిమ సీటు కేటాయించాలని అధిష్టానాన్ని కోరితే ఏ మాత్రం స్పందన రాలేదని రాకేష్ రెడ్డి తెలిపారు. పార్టీ మీటింగులకు రాకపోతే అడిగే నాథుడు కూడా లేడని, పార్టీ టికెట్ అడగటమే తాను చేసిన పాపం అన్నారు. సర్వే ఆధారంగా టికెట్ ఇస్తామని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. కానీ అది పచ్చిబూటకమన్నారు. సర్వేలన్నీ తనవైపే ఉంది, ప్రజల్లోనూ తన పేరు ఉండగా టికెట్ మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
70 శాతం నియోజకవర్గాన్ని కవర్ చేశా. వేల కుటుంబాలను కలిసి మాట్లాడాను. నాకు ఇవ్వాలని అడిగితే నీకు ఇంకా భవిష్యత్ ఉందని పార్టీ పెద్దలు చెబుతున్నారు. దేశ భవిత యువత చేతుల్లో ఉంటుందంటారు. కానీ బీజేపీలో ఆ పరిస్థితి లేదన్నారు. వయసు మీద పడ్డాక, వృద్ధాప్యంలో టికెట్ ఇస్తే ఫలితం ఏముంటుంది. ప్రజా బలం ఉన్న నేతల్ని బీజేపీ ఆదరించదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో సాంబయ్య అనే అభ్యర్థి కొండా మూరళి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. తదుపరి ఎన్నికల్లో సాంబయ్యకు పార్టీ మద్దతు లభించలేదని చెప్పారు. వరంగల్ పశ్చిమలో ఎవరికివ్వాలని మూడు సర్వేలు చేస్తే తనకు ఇవ్వాలని రిపోర్ట్ వచ్చిందని రాకేష్ రెడ్డి వెల్లడించారు.
తాను రైతు బిడ్డను, పేదింటి బిడ్డను అయినందునే ప్రజాధరణ ఉన్నప్పటికీ తనకు టికెట్ ఇవ్వడం లేదని రాకేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ జితేందర్ కుమారుడి పేరుతో రెండో లిస్టులో ఒక్క పేరు ప్రకటించారు. సిద్ధాంతాలు కలిగిన పార్టీ అంటే ఒక్కరి పేరుతో అభ్యర్థుల జాబితా ప్రకటించడమా అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ కుమారుడు కావడం, జాతీయ స్థాయిలో ప్రభావితం చేస్తారని వాళ్లకు టికెట్లు ఇచ్చుకున్నారని పలు విషయాలు పేర్కొన్నారు.