Bhatti Vikramarka Review on Hydel Project in Srisailam | శ్రీశైలం: శ్రీశైలంలో అగ్ని ప్రమాదంలో మరమ్మతుకు గురైన యూనిట్ 4 పనులకు టెండర్లు పిలవాలని తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క జెన్కో అధికారులను ఆదేశించారు. తెలంగాణలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీ తెస్తామన్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడెల్ పవర్ జనరేషన్ ప్రాజెక్టులో సోమవారం భట్టి విక్రమార్క పర్యటించిన అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇంధన శాఖ సిఎండి ఎస్ .ఏ. ఎం.రిజ్వీతో పాటు స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఒక సీజన్లో 3 నెలల్లో 60 కోట్ల విలువైన విద్యుత్తును ఉత్పత్తి చేస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేవలం రూ.2 కోట్లు ఖర్చు అయ్యే మరమ్మతులపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం కారణంగా రూ.60 కోట్ల విలువైన విద్యుత్తును కోల్పోవడం అర్థం లేని పని అన్నారు.
మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడెల్ జెన్కో ప్రాజెక్టు రాష్ట్రానికి గర్వకారణమైంది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా ప్రసిద్ధిగాంచిన హిటాచి సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించింది. ఈ ప్రాజెక్టుతో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో 2020లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం దుర్ఘటన బాధాకరం. నాటి షార్ట్ సర్క్యూట్ ప్రమాదం నుంచి యూనిట్ ని కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి శాంతి చేకూరాలి. బాధిత కుటుంబాలకు ఎప్పుడు ఏం కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. ప్రస్తుతం ప్రతి పనికి, అభివృద్ధికి విద్యుత్ అనేది ప్రధాన ఆధారంగా ఉంది.
జెన్కో ప్రాజెక్టుకు సంబంధించి త్వరగా నిర్ణయాలు తీసుకుంటే, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి ఇక్కడ సాధించవచ్చు. దాంతో తక్కువ ధరలకే తెలంగాణ ప్రజలకు విద్యుత్తు అందించే అవకాశం ఉంది. గత ప్రమాదం నుంచి పని ప్రాంతాల్లో భద్రతాపరంగా ఏం చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. ప్లాంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని అధికారులు కనెక్ట్ చేసుకోవాలి. ప్లాంట్ లోకి వచ్చే ప్రతి మనిషికి చిన్న ఆక్సిజన్ సిలిండర్ తప్పనిసరిగా ఇవ్వాలి. భద్రతా చర్యల విషయంలో నిధులు సమస్య కాదు, మనిషి ప్రాణం విలువైనది, స్వీపర్ నుంచి సీఈ వరకు ఇదే సూత్రం వర్తిస్తుందని’ పేర్కొన్నారు.
ప్లాంట్ లో అధికారులు, సిబ్బంది, కార్మికుల భద్రతకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. Tailpond తెగిపోయింది మరమ్మతులు చేయలేదని మంత్రి దృష్టికి తెచ్చారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తూ లేఖలు ఇస్తే వెంటనే ఆ పనులు చేపడదామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అని, విద్యుత్ శాఖలో స్వీపర్ నుంచి సీఈ వరకు అంతా ఒక కుటుంబంలా పనిచేయాలని ఆయన సూచించారు. మీకు సమస్య వచ్చినా వినడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఆర్టిజన్ల రెగ్యులరైజేషన్, ఉద్యోగులకు డి మోషన్స్ వంటి అంశాలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మెగా రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి, పరిణికా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.