Revanth Reddy News: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఆ పర్యటనలో భాగంగా ఆయన వివిధ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులను సీఎం కలిసి.. వారికి పలు విజ్ఞప్తులను చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను సోమవారం సాయంత్రం (జూన్ 24) కలిశారు. హైదరాబాద్ నగరంలో తరచూ తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యల గురించి రేవంత్ రెడ్డి రాజ్ నాథ్ సింగ్ వద్ద ప్రస్తావించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో అన్ని భూములు రక్షణ శాఖ పరిధిలో ఉండడంతో అక్కడి రోడ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోందని చెప్పారు. రక్షణ భూముల విషయంలో కేంద్రం ఆలోచించాలని వివరించారు.


అలాగే, వరంగల్ లో ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటు సహా ఇతర అంశాలను కూడా రాజ్ నాథ్ సింగ్‌కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం కూడా ఇచ్చారు. హైద‌రాబాద్‌లో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, ఇత‌ర అవ‌స‌రాల‌కు ర‌క్ష‌ణ శాఖ భూములు 2,450 ఎక‌రాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వానికి బ‌దలాయించాల‌ని రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. అలాగే రావిరాల గ్రామంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన 2,462 ఎక‌రాల భూముల‌ను ఇమార‌త్ ప‌రిశోధ‌న కేంద్రం (ఆర్‌సీఐ) ఉప‌యోగించుకుంటున్న విష‌యాన్ని ముఖ్య‌మంత్రి ర‌క్ష‌ణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.


హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు న‌గ‌రం చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, ఫ్లైఓవ‌ర్లు, ఇత‌ర మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ర‌క్ష‌ణ శాఖ భూములు త‌మ‌కు అవ‌స‌ర‌మ‌ని, ఆర్‌సీఐ రాష్ట్ర ప్ర‌భుత్వ భూములు వినియోగించుకుంటున్నందున ర‌క్ష‌ణ శాఖ భూములు 2,450 ఎక‌రాలు త‌మ‌కు అప్ప‌గించాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. రాష్ట్ర ప్ర‌భుత్వం, ర‌క్ష‌ణ శాఖ భూముల ప‌ర‌స్ప‌ర బ‌దిలీకి అంగీక‌రించాల‌ని రక్ష‌ణ శాఖ మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఙ‌ప్తి చేశారు.


వరంగల్‌లో సైనిక్ స్కూల్


వ‌రంగ‌ల్ న‌గ‌రానికి గ‌తంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గ‌త రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మాణప‌రంగా ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. వ‌రంగ‌ల్ సైనిక్ స్కూల్ అనుమ‌తుల గ‌డువు ముగిసినందున అనుమ‌తులు పున‌రుద్ధ‌రించాల‌ని లేదా తాజాగా మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. 


ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ తో పాటుగా కొత్తగా ఎన్నికైన లోక్ స‌భ ఎంపీలు మల్లు రవి, రఘురామిరెడ్డి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, చామ‌ల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ స‌భ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.