Decisions during Telugu CMs Meeting | హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని విభజన సమస్యలపై ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు చర్చించారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, ఇతర అంశాలపై సామరస్య పూర్వకంగా చర్చించుకోవాలని భావిస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉన్నతస్థాయి అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సీఎస్ తో సహా ఒక్కో రాష్ట్రం నుంచి ముగ్గురు ఉన్నతాధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తామన్నారు.
ఒకవేళ ఉన్నతస్థాయి అధికారుల కమిటీతో పరిష్కారం కాని అంశాలపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ అప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై పరిష్కారం దొరకకపోతే.. ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మొదటగా అధికారుల కమిటీ, అందులో పరిష్కారం కాని అంశాలపై మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు కమిటీల ద్వారా ఇంకా పరిష్కారం కాని అంశాలు ఉంటే, ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అయి నిర్ణయం తీసుకుంటారని ఉమ్మడి ప్రెస్ మీట్‌లో భట్టి విక్రమార్క తెలిపారు.
డ్రగ్స్‌పై ఉమ్మడిగా ఉక్కుపాదం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాంటీ నార్కోటిక్ డ్రైవ్ లో భాగంగా డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయడానికి అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించాం. డ్రగ్స్ వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నాం. సైబర్ క్రైమ్ తో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. రెండు రాష్ట్రాలు కలిసి డ్రగ్స్ మహమ్మారిపై ఉమ్మడిగా పోరాటం చేయాలని విధాన పరమైన నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర విభజనతో తలెత్తిన వివాదాలు, సమస్యలతో పాటు నేటికి పరిష్కారం కాని అంశాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీలో చర్చించారు. అయితే అక్కడితో ఆగకుండా అభివృద్ధి విషయంలో సహకరించుకుని రెండు తెలుగు రాష్ట్రాలు ముందుకెళ్లాలని చర్చ జరిగింది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలతో పాటు పేర్కొనని, స్పష్టత లేకపోవడంతో పరిష్కారం కాని విషయాలపై రేవంత్ రెడ్డి, చంద్రబాబు తమ మంత్రులు, అధికారుల బృందంలో కలిసి చర్చించాయి. సామరస్య పూర్వకంగా సమస్య పరిష్కరించుకుందామని భావించి మొదట అధికారుల కమిటీ ఆపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు దశలలో పరిష్కారం కాని విషయాలపై నేరుగా ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అయి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.
స్టేట్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న ఆస్తుల పంపకాలతో పాటు చట్టంలో పేర్కొనని వాటిపై సైతం చర్చించారు. విద్యుత్ బకాయిల పెండింగ్, ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుల చెల్లింపులు, హైదరాబాద్ లో ఉన్న మూడు భవనాలు ఏపీకి కేటాయింపు అంశం, ఉద్యోగుల విభజన అంశాలు, ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టుల అప్పులు పంపకాలు, విలీనం చేసిన 7 మండలాలు అంశాలపై సీఎంల భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.