Revanth Reddy Gives Gift To Chandrababu | హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మీటింగ్ ప్రారంభానికి ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు రాసిన "నా గొడవ" పుస్తకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహూకరించారు. చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ ఇచ్చిన పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సీఎంల భేటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు తన టీమ్ తో ప్రజాభవన్‌కు చేరుకోగా సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ భేటీలో ఏపీ నుంచి చంద్రబాబు, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, బీసీ జనార్ధన్ రెడ్డి, ఏపీ సీఎస్ నీరభ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. గత పదేళ్లుగా పరిష్కారం కాని సమస్యలపై తాజా భేటీలో చర్చిస్తున్నారు.