MLC Elections In Telangana: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీలుగా ఉంటూ ఎమ్మెల్యేలుగా బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఇద్దరు ఎన్నికయ్యారు. దీంతో వాళ్లు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.  ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.


ఈ  రెండు స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. గత ఎన్నికల్లో సీట్లు రాని, వచ్చి విజయం సాధించలేకపోయిన ఎంతో మంది అభ్యర్థులు ఈ రెండు స్థానాలతోపాటు గవర్నర్‌ కోట్లా ఎమ్మెల్సీ స్థానాలను ఆశిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్నందున  అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 14న దావోస్‌ పర్యటనకు సీఎం వెళ్లనున్నారు. దాని కంటే ముందే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని కసరత్తు చేస్తున్నారు.


శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన సీఎం ఇదే అంశంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపా దాస్‌ మున్సీతో చర్చించారు. ఈ రెండు స్థానాలకు ఎవరికి కేటాయించాలన్న దానిపై అధినాయకత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో రేవంత్‌ ఈ మేరకు ఇన్‌చార్జ్‌తో సమాలోచనలు చేశారు. ఇదే విషయపై సీఎం రేవంత్‌ రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీతో మాట్లాడే అవకాశముందని చెబుతున్నారు. 


ఈ నెల 18తో ముగియనున్న నామినేషన్లు గడువు.. 


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికకు సంబంధించి ఈ నెల 18తో నామినేషన్లు గడువు ముగియనుంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎన్నికను సులభతరం చేసుకునేందుకు అవకాశముందని రేవంత్‌ భావిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి.. గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్‌ పార్టీకి అనుకోకుండా దక్కిన సువర్ణావకాశంగా ఆశావహులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటకముందే ఎమ్మెల్సీలుగా ఎన్నియ్యే అవకాశం లభించడంతో చాలా మంది ఆశావహులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. 


ఆశావహుల జాబితా పెద్దదే.. 


ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఆశించిన వారి సంఖ్య పెద్దదిగానే ఉంది. గడిచిన ఎన్నికల్లో సీట్లు రాని వాళ్లు, వచ్చినా విజయం సాధించలేకపోయిన ఎంతో మంది ఈ ఎమ్మెల్సీ స్థానాలు కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆశావహుల జాబితాలో షబ్బీర్‌ అలీ, చిన్నారెడ్డి, జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్‌, మహేష్‌ కుమార్‌ గౌడ్‌, సంపత్‌ కుమార్‌, నిరంజన్‌, మధుయాష్కీ, శోభారాణి, అనిల్‌ కుమార్‌ వంటి నేతలు ఉన్నారు. వీరితోపాటు మరికొంత మంది ముఖ్య నాయకులు సైలెంట్‌గా తమ ప్రయత్నాలను సాగిస్తున్నారు. 


గవర్నర్‌ కోటాలో మరో రెండు.. 


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలతోపాటు గవర్నర్‌ కోటాలో మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. వీటికి కూడా కాంగ్రెస్‌ పార్టీ ఒకేసారి అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఒకేసారి నలుగురు అభ్యర్థులకు ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కనుంది. ఈ నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలంగాణ జన సమితి వ్యవస్థాపకులు కోదండరామ్‌కు అప్పగించే అవకాశముంది. దాదాపు పేరును ఖరారు చేసినట్టుగా చెబుతున్నారు. మిగిలిన మూడు స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేసే అవకాశమంది. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఒక్క స్థానాన్ని కేటాయించవచ్చని చెబుతున్నారు.