Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటనపై స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు చేస్తోంది. శనివారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతను స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, ఇతర నేతలు, సభ్యులు దాదాపు 4 గంటలు సమావేశమయ్యారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో నాలుగైదు నియోజకవర్గాల్లోనే చిక్కుముడి పడినట్లు సమాచారం. ఈ స్థానాల్లో సీనియర్ నేతలు టికెట్ల కోసం గట్టిగా ఆశిస్తుండగా, ఇతర నేతలు కూడా పోటీ పడుతున్నారు. 


ఈ క్రమంలో రాష్ట్ర స్క్రీనింగ్, సీఈసీ ఎటూ తేల్చుకోలేకపోయినట్లు తెలుస్తోంది. దీంతో రాహుల్ గాంధీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం. ఆయన సమక్షంలోనే ఈ స్థానాల అభ్యర్థులను ఖరారు చేస్తారని ప్రచారం జగింది. ఈ నేపథ్యంలోనే రెండో రోజు ఆదివారం ఢిల్లీలో సమావేశమైన స్క్రీనింగ్‌ కమిటీ అభ్యర్థుల ఎంపికపై విస్తృతంగా చర్చించింది. మిగిలిన 64 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. మొదటి జాబితాలో కాంగ్రెస్ 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 


సీనియర్ల నుంచి తీవ్ర ఒత్తిడి
స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో రెండో జాబితాకు సంబంధంచి ఇప్పటికే 35 నుంచి 40 నియోజకవర్గాల అభ్యర్థులపై ఏకాభిప్రాయం వచ్చినట్లు సమాచారం. మిగిలిన సీట్లలో నాలుగైదు సీట్లకు సీనియర్ల నుంచి ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. దసరా పండుగ అనంతరం ఈనెల 25న కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. అదే రోజున కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కొన్ని స్థానాలను పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. 


వామ పక్షాలతో కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు
మరోవైపు, సీట్ల కేటాయింపులో భాగంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు చెరో రెండు స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఆయా పార్టీ మధ్య సీట్ల సర్దుబాటుపై పీటముడి తెగడం లేదు. రెండు రోజలు స్క్రీనింగ్‌ కమిటీ సీట్ల సర్దుబాటుపై చర్చించినప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.


వైరా వద్దు పాలారు ముద్దంటున్న సీసీఎం
వైరాకి బదులు పాలేరు సీటు కోసం సీపీఎం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే పాలేరు ఇవ్వడానికి కాంగ్రెస్ ససేమిరా అంటోంది. వైరా సీటుతో సరిపెట్టుకోవాలని సీపీఎం నేతలను ఒప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ అందుకు సీపీఎం అంగీకరించడం లేదని ప్రచారం జరుగుతోంది. పాలారుతో తమకు బలం ఉందని, తమకు పట్టున్న సీట్లను కేటాయిస్తే గెలిచి చూపిస్తామని చెబుతున్నట్లు సమాచారం.


సీపీఐకి షాకిచ్చిన ఏఐటీయూసీ
ఇదిలా ఉండగానే.. చెన్నూరులో అభ్యర్థిని ప్రకటించక ముందే సీపీఐకి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నూరులో సీపీఐ పోటీ చేయడంపై సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ వ్యతిరేకించింది. సీపీఐ అక్కడ పోటీ చేయవద్దంటూ ఏకంగా తీర్మానం చేసింది. బలం లేని చోట పోటీ వద్దంటూ తీర్మానంలో పేర్కొంది. వెంటనే చెన్నూర్ టిక్కెట్ తీసుకునే ప్రతిపాదనను విరమించుకోవాలని మందమర్రి కార్మిక సంఘం విభాగం కోరింది. దీంతో సీపీఐకి ఊహించని షాక్‌ తగిలినట్టు అయ్యింది.