Congress Vs BRS: పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ఈనెల 13న నల్గొండ (Nalgonda)లో బీఆర్‌ఎస్ (BRS) భారీ బహిరంగ నిర్వహిస్తున్న ప్రకటించింది. ఆ సభలో కృష్ణా జలాలకు సంబంధించి అన్ని విషయాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు మాజీ సీఎం కేసీఆర్ (KCR). నిన్న(ఫిబ్రవరి 6వ తేదీ) తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో దక్షిణ తెలంగాణ నేతలతో సమావేశమైన కేసీఆర్... ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో ప్రాజెక్టుల (Projects)ను అప్పగించాలని కేంద్రం నుంచి ఎంతో ఒత్తిడి వచ్చిందని.. అయినా తలొగ్గలేదన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekawat) తమకు బెరించారని కూడా చెప్పారు కేసీఆర్. ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు అయినా ఒకే గానీ.. ప్రాజెక్టులు అప్పగించేందుకు మాత్రం ఒప్పుకోలేదని చెప్పారాయన. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం (congress Government) అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాక ముందే.. ప్రాజెక్టులను కేంద్రం చేతిలో పెట్టేసింది మండిపడ్డారు. కృష్ణా జలాల గురించి కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదని.. అందుకే కేంద్రానికి అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు మరోసారి పోరాటానికి సిద్ధంగా ఉండాలన్నారు కేసీఆర్. తమను ఎవరూ అడ్డుకోలేదని... హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర తమకుందన్నారు. ఎవరు అడ్డుకున్నా... ఈనెల 13న నల్గొండలో సభ జరిపి తీరుతామన్నారు కేసీఆర్.
నల్గొండ సభ విషయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నల్గొండలో సభ పెట్టే ముందు... కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ మంత్రులు డిమాండ్ చేశారు. ప్రాజెక్టులకు కేఆర్‌ఎంబీ తాము అప్పగించలేదని... బీఆర్‌ఎస్ హయాంలో అప్పగించారని అంటున్నారు. ప్రాజెక్టును అప్పగిస్తూ కేసీఆర్ స్వయంగా సంతకాలు చేసిన పత్రాలు తమ దగ్గర ఉన్నాయంటున్నారు. బీఆర్‌ఎస్ కావాలనే కాంగ్రెస్‌పై అబద్దపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు.. బీఆర్‌ఎస్‌కు పోటీగా నల్గొండలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న (మంగళవారం) సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షత గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో కూడా ఈ విషయంపై చర్చించారు కాంగ్రెస్ ముఖ్య నేతలు. పార్లమెంట్ ఎన్నికల ముందు... ప్రజల్లో వ్యతిరేకత రాకముందే.. బీఆర్‌ఎస్‌కు ధీటుగా సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఓవైపు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతూనే... మరోవైపు బీఆర్‌ఎస్ ఎదుర్కొనేందుకు వ్యూహరచన చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. నిన్న (మంగళవారి) జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో... పార్లమెంటుకు పోటీచేసే అభ్యర్ధుల జాబితాపై చర్చించింది. అదే సమయంలో... బీఆర్‌ఎస్ సభకు పోటీగా నల్గొండ పార్లమెంట్ పరిధిలో 2 లక్షల మందితో సభ పెట్టాలని ప్రతిపాదన పెట్టారు మంత్రి కోమటిరెడ్డి. ఈ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ సభలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే హామీలపై కూడా ప్రకటన చేయాలని భావిస్తోంది హస్తం పార్టీ. పార్లమెంట్ ఎన్నికల ముందు అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య జరుగుతున్న ఈ పొలిటికల్ వార్... తెలంగాణ రాజకీయ వేడి రగిలిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ అన్నట్టుగా రాజకీయం మారిపోతోంది.