Mahi V Raghava: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రిగా మళ్లీ వైఎస్ జగన్ గెలుస్తారా లేదా పొత్తు రాజకీయాలతో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా.. లేదా ఈ రెండూ కాకుండా మరోసారి చంద్రబాబును ప్రజలు నమ్మగలరా అని జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇదే సమయంలో ‘యాత్ర 2’ అనే పొలిటికల్ మూవీతో రంగంలోకి దిగాడు దర్శకుడు మహి వీ రాఘవ. ఈ సినిమాలో జగన్ పాదయాత్ర గురించి పాజిటివ్‌గా చూపించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. త్వరలోనే విడుదల కానున్న ఈ మూవీ ప్రెస్ మీట్‌లో ముఖ్యమంత్రిగా జగన్ వైఖరి గురించి విమర్శించారు ఓ జర్నలిస్ట్. దానికి మహి వీ రాఘవ తన స్టైల్‌లో సమాధానం చెప్పాడు.


జగన్‌పై విమర్శలు..


ప్రస్తుతం ఏపీలో రాజకీయాల హీట్ నడుస్తున్న సమయంలోనే ‘యాత్ర 2’ మూవీని రంగంలోకి దించాలని డిసైడ్ అయ్యాడు మహి వీ రాఘవ. ఈ సినిమా ఫిబ్రవరీ 8న విడుదలకు సిద్ధమయ్యింది. అందుకే ప్రమోషన్స్‌లో వేగం పెంచింది మూవీ టీమ్. అందులో భాగంగానే ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. అందులో మహి వీ రాఘవకు చాలా అసాధారణమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘‘నేను విన్నాను, నేను ఉన్నాను అనే మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా నమ్మి జగన్‌ను గెలిపించి సీఎం సీట్ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఎక్కడికి వెళ్లాలన్నా పరదాలు కట్టుకొని వెళ్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు. దీనిపై యాత్ర 3 అనే సినిమా తీస్తారా’’ అని మహి వీ రాఘవకు ప్రశ్న ఎదురయ్యింది.


మంచి మీడియా ఉంది..


ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి హైదరాబాద్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్‌లో విషయాలు ఎలా తెలుసు అని మహి వీ రాఘవ రివర్స్ ప్రశ్న అడిగాడు. మీమ్స్‌లో చూస్తున్నామని ఆయన సమాధానమిచ్చారు. దీంతో ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు మహి వీ రాఘవ. ‘‘ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి ఎవరైనా కూడా వారికి వారి సెక్యూరిటీ అనేది ఉంటుంది. అది పక్కన పెడితే.. మనకు అదృష్టమో, దురదృష్టమో కానీ తెలుగు రాష్ట్రాల్లో మంచి మీడియా ఉంది. ఈ మీడియా అనేది చాలా చీలిపోయి ఉంది. అది కూడా మంచి విషయమే. ఎందుకంటే మంచి, చెడు రెండు విషయాల్లో వారు ఉంటారు’’ అని మీడియా గురించి మాట్లాడాడు మహి వీ రాఘవ.


సోషల్ మీడియా వల్లే ఇదంతా..


‘‘మనం అవతల వారిపై ఎంత బురద జల్లుతున్నామో.. వారు కూడా అంతే బురద ఇక్కడ జల్లుతారు. నన్ను అడిగితే.. రెండూ బురదే అంటాను. మనకు అనవసరం అది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫ్రీ డేటా, ఫ్రీ టైమ్, ఏం పనిలేని పంచాయితీ. ఈరోజుల్లో ఎవడైనా ఎవరి మీద అయినా బురద జల్లొచ్చు. ఎవడు ఎవడి మీద అయినా వీడియో పెట్టొచ్చు. టైమ్ ఉన్నవాడు అది చూస్తాడు. పట్టించుకోవాలి అనుకున్నవాడు పట్టించుకుంటాడు. ఇవన్నీ చేస్తూ తొమ్మిదేళ్లుగా ఆయనను దూషించాం. ఆయన 151 సీట్లు కొట్టి సీఎం అయ్యారు. ఇక్కడ మీమ్స్ పెట్టి, బురద జల్లే వాళ్లం అక్కడక్కడే తిరుగుతున్నాం’’ అని సోషల్ మీడియాపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు మమి వీ రాఘవ.



Also Read: లావణ్య కాకుండా ఆ హీరోయిన్ అంటే ఇష్టం, బాబాయ్‌తో సినిమా చేయాలనుంది - వరుణ్ తేజ్