తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు కీలక నేతలను పోలీసులు బుధవారం ఉదయం నుంచే హౌస్ అరెస్టులు చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. స్పందించకపోతే నేడు అన్ని పోలీస్ కమిషనరేట్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రేవంత్ రెడ్డి అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగానే హైదరాబాద్ కమిషనరేట్ ముందు రేవంత్ రెడ్డి, రాచకొండ కమిషనరేట్ ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముట్టడికి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమై నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు.


అసోం బీజేపీ ముఖ్యమంత్రి పరోక్షంగా సోనియాగాంధీని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేయాల్సిందిగా 700కు పైగా పోలీస్ స్టేషన్లలో రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే రేవంత్ ఇంటి వద్ద పోలీసుల హడావుడి కనిపించింది. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లే అన్నీ దారులను బారీకేడ్లతో పోలీసులు మూసేశారు.






ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా..
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా హైదరాబాద్‌లో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కామారెడ్డికి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి షబ్బీర్ అలీని జూబ్లీహిల్స్‌లో తన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరికొందరు నేతలు ధర్నా చేయనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు.


ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేయడంలో జాప్యం చేస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జిల్లాల పోలీసు ప్రధాన కార్యాలయాల ముట్టడి కొరకు బయలుదేరడానికి సిద్ధమవుతున్న సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయాన్నే భారీ బందోబస్తు నడుమ జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్న పోలీసులు తనతో మాట్లాడి బయటకు వెళ్లకుండా దిగ్బంధం చేశారు. మరోవైపు, జిల్లా నాయకులు, కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు.






మరోసారి అసోం సీఎంపై రేవంత్ ఫిర్యాదు
అసోం సీఎంపై రేవంత్ రెడ్డి మరోసారి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్లు నమోదు చేయకపోవడంతో మరోసారి ఫిర్యాదు చేశారు. పోలీసులు పెట్టిన ఐపీసీ 504, 505(2) సెక్షన్లపై టీపీసీసీ చీఫ్ అభ్యంతరం తెలిపారు. 153A,505(2),294,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని రేవంత్‌కు పోలీసులు తెలిపారు. రాహుల్‌పై వ్యాఖ్యలను అసోం సీఎం సమర్థించుకుంటున్నారని అన్నారు. సభ్యసమాజంలో మనుషులు మాట్లాడే భాష మాట్లాడలేదని మండిపడ్డారు. గాంధీ కుటుంబాన్ని, మహిళలను కించపరిచేలా మాట్లాడారన్నారు. అసోం సీఎం వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని, మోదీ సర్కార్ వెంటనే అసోం సీఎంను బర్తరఫ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.