ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబయి పర్యటన తేదీ ఖరారైంది. ఈ నెల 20న ఆయన ముంబయికి వెళ్లనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ సమావేశం కానున్నారు. మ‌హారాష్ట్ర సీఎం ఆహ్వానం మేర‌కు 20న కేసీఆర్ ముంబ‌యికి వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. బుధ‌వారం ఉద‌యం సీఎం కేసీఆర్‌కు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేసి.. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మ‌ద్దతు పలికారు.


ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘కేసీఆర్ గారూ మీరు చాలా బాగా పోరాడుతున్నారు. న్యాయమైన పోరాటం మీది. సరైన సమయంలో మీరు మీ గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడడానికి మీ పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లండి. మీకు మా నుంచి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకోసం దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారం మేం అందిస్తాం’’ అని చెప్పినట్లుగా సీఎంవో వర్గాలు తెలిపాయి.


ఇటీవల ప్రెస్ మీట్‌లో త్వరలో తాను ముంబయి వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశంలోని ఇతర పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయడంలో తాను కీలక పాత్ర పోషిస్తానని కేసీఆర్ ఆ సందర్భంగా తెలిపారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్‌లో ఎలా కలిసి ముందుకెళ్లాలనే అంశాలపై ముఖ్యమంత్రులు ఉద్ధవ్ ఠాక్రే - కేసీఆర్ ఆ భేటీలో చర్చించే అవకాశం ఉంది.