200 Units Free Current Process In TS: ఆరు గ్యారెంటీల అమలు దిశగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ సర్కార్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు నెలలు పూర్తవుతోంది. దీంతో ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ హామీల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలు అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది. చేయూత కింద రూ.10లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అమలు చేసింది. ఇప్పుడు మరో రెండు గ్యారెంటీలు అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో ముఖ్యంగా... 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు.. కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్ సర్కార్. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందాలంటే...
200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందాలనుకునే వారికి కొన్ని కండిషన్లు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవారికే 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ లభించనుంది. అలాగే.. ఒక ఇంటికి ఒక మీటరు ఉన్న వారికే పథకం అమలవుతుంది. అద్దె ఇళ్లలో ఉన్నవారు సైతం ఈ స్కీమ్‌కు అర్హులు అని స్పష్టం చేశారు. 200 యూనిట్లు లోపు కరెంట్ వాడే గృహ వినియోగదారులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 2వేల 181 యూనిట్ల లోపు వాడకం ఉండాలి. గత సంవత్సరం మొత్తం ఓ వినియోగదారుడు 1500 యూనిట్లు వాడితే... దానికి 10 శాతం కలిపి 1650 యూనిట్లను 12 నెలలకు విభజించి నెలకు 137 యూనిట్లు ఉచితంగా ఇస్తారు. ఆపైన వాడితే బిల్లు లెక్క కడతారు.
200 యూనిట్ల ఉచిత కరెంట్ హామీ అమలుకు కసరత్తు షురూ
గృహజ్యోతి పథకం (Gruha Jyothi Scheme) అమలుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ (Free Current) ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఉచిత విద్యుత్ కోసం గృహజ్యోతి కింద 81.54 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇవాళ్టి నుంచే లబ్ధిదారుల డేటాపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే గృహజ్యోతి రిజిస్ట్రేషన్స్ మొదలయ్యాయి. ప్రతి నెల మొదటివారంలో 10రోజుల పాటు.. మీటర్ రీడింగ్‌తోపాటు లబ్ధిదారుల గుర్తింపు ఉంటుంది.
మీటర్ రీడింగ్(Meter Reading) తీసే సిబ్బందితోనే లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. మీటర్ రీడర్‌కు రేషన్, ఆధార్ కార్డ్ నంబర్లతో పాటు, మొబైల్ నంబర్ లింక్ చేస్తారు. రీడింగ్ కోసం తెచ్చిన హ్యాండ్ హెల్త్ మెషీన్‌లో ఎంట్రీ చేస్తారు. గ్రేటర్ పరిధిలో నేటి నుంచే మీటర్ రీడర్లు ఇంటింటికీ వస్తున్నారు. మరోవైపు... ఉచిత కరెంటు స్కీమ్ కోసం ఒక పోర్టల్ తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ పథకం పొందాలనుకునేవారు కరెంట్ కనెక్షన్ల వివరాలన్నీ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోనూ ఇదే విధానం అమలు చేస్తున్నారు.
తెలంగాణలో కోటి 31 లక్షల 48వేల డొమెస్టిక్ విద్యుత్ కలెక్షన్లు ఉన్నాయి. వీటిలో నెలకు 200 యూనిట్లు లోపు వాడేవి దాదాపు కోటి వరకు ఉంటాయి. ఈ కనెక్షన్ల నుంచి ప్రతినెల కరెంటు బిల్లులపై విద్యుత్ పంపిన సంస్థలకు సుమారు 350 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కోటి కనెక్షన్లు ఉచితంగా ఇస్తే ఖర్చు ఎంత డిస్కములకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక యూనిట్ కరెంటు సరఫరాకు రూ. 7.7 ఖర్చవుతోంది. అయితే 200 యూనిట్ల వినియోగించే వారికి ప్రస్తుతం సగటు కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వినియోగాన్ని బట్టి ఏడాదికి 4వేల 200 కోట్లు డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. యావరేజ్ సప్లై కాస్ట్ ప్రకారం చెల్లించాల్సివస్తే ఇంకా ఎక్కువ నిధులు అయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వంపై అధనపు భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న కరెంట్ వినియోగాన్ని బట్టి... ఇప్పటికే ఏడాదికి 4వేల 200 కోట్ల రూపాయలను డిస్కమ్‌లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 200 యూనిట్ల ఉచిత కరెంట్ అమలు చేస్తే... చెల్లించాల్సిన నిధులు మరింత పెరుగుతాయి.
రెండు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో... ప్రజల్లో వ్యతిరేకత పెరగకముందే మరో రెండు హామీలకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టేసింది. ఇక.. .500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేయనుంది.