Kiran Rao Reply to Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీని ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడ్డారో.. అంతకంటే ఎక్కువగా విమర్శించారు కూడా. సినిమాను సినిమాలాగా చూడాలి అని చెప్పేవారు కూడా ‘యానిమల్’లో పలు అంశాలు అస్సలు బాలేవని, సమాజంపై చెడు ప్రభావం చూపిస్తాయని మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక చాలామంది సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై మండిపడ్డారు. డైరెక్ట్‌గా ఈ సినిమా గురించి మాట్లాడకపోయినా.. చాలామంది సెలబ్రిటీలు విమర్శించే తీరును బట్టి అది ‘యానిమల్’ గురించే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. తాజాగా అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు విషయంలో కూడా అదే జరగగా.. దానికి తాను క్లారిటీ ఇచ్చింది.


ఫోకస్ పెడితే మంచిది..


తాజాగా అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు.. ఒక సినిమాను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసింది. అది ‘యానిమల్’ గురించే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలా అది సందీప్ వరకు చేరుకుంది. దీంతో ఈ దర్శకుడు చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ‘‘తను అమీర్ ఖాన్ సినిమాలపై ఫోకస్ పెడితే మంచిది’’ అంటూ సలహా ఇచ్చాడు. ఇక సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన సలహాపై కిరణ్ రావు తాజాగా రియాక్ట్ అయ్యింది. అసలు తను ‘యానిమల్’ అనే పేరు ఉపయెగించలేదని, సందీప్ ఎందుకు అలా అర్థం చేసుకున్నాడో, ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడో తనకు అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దాంతో పాటు సందీప్.. అమీర్‌పై చేసిన కామెంట్స్‌పై కూడా స్పందించింది.


అసలు సినిమాలు చూడలేదు..


‘‘నేనెప్పుడు సందీప్ సినిమాలపై కామెంట్ చేయలేదు. ఎందుకంటే నేనెప్పుడు ఆయన సినిమాలు చూడలేదు. సినిమాల్లో ఆడవారిని ఎలా చూపిస్తున్నారు, స్త్రీకి వ్యతిరేకంగా ఎలాంటి అంశాలు ఉన్నాయి లాంటి విషయాలపై నేను తరచుగా మాట్లాడుతూనే ఉంటాను. చాలా ప్రాంతాల్లో చాలాసార్లు నేను ఇలా మాట్లాడాను. కానీ నేను ఎప్పుడూ ప్రత్యేకంగా ఒక సినిమా పేరు చెప్పలేదు. ఎందుకంటే అలా ఒక్క సినిమాలో మాత్రమే లేదు. నేను ఆయన సినిమా గురించే మాట్లాడుతున్నానని సందీప్ రెడ్డి వంగా ఎందుకు అనుకున్నారో మీరు వెళ్లి ఆయననే అడగాలి. నేను మాత్రం ఎప్పుడూ ఆయన సినిమా చూడలేదు’’ అని క్లారిటీ ఇచ్చింది కిరణ్ రావు.


అమీర్‌ మూవీపై సందీప్ విమర్శలు..


అమీర్ ఖాన్ కూడా తన కెరీర్‌లో పలుమార్లు ఆడవారిని కించపరిచే పాటల్లో కనిపించాడు. అలాంటి పాటల్లో ‘ఖంబే జైసీ ఖాడీ హై’ ఒకటి. ఇక కిరణ్ రావు ‘యానిమల్’ను విమర్శించిందని భావించిన సందీప్ రెడ్డి వంగా.. ఈ పాటను గుర్తుచేస్తూ అమీర్‌పై విమర్శలు కురిపించాడు. దీనిపై కూడా కిరణ్ రావు స్పందించింది. అమీర్ అప్పుడే అలాంటి పాటను చేసినందుకు క్షమాపణలు చెప్పాడని రివీల్ చేసింది. ‘‘కొందరు వ్యక్తులు మాత్రమే వెనక్కి తిరిగి తాము చేసిన పనిని గమనించి దానికి క్షమాపణలు చెప్తారు’’ అంటూ అమీర్ గురించి గొప్పగా మాట్లాడింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో కిరణ్ రావు, సందీప్ రెడ్డి వంగా మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ హాట్ టాపిక్‌గా మారింది.


Also Read: ‘యానిమల్’ మూవీపై రణవీర్ సింగ్ రివ్యూ - ఆశ్చర్యపోయిన దర్శకుడు