కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తీవ్రంగా పోటీ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ టికెట్ల కోసం దరఖాస్తులు సమర్పించారు. కొందరు స్వయంగా వెళ్లి దరఖాస్తులు సమర్పిస్తే మరికొందరు తమ అనుచరుల ద్వారా గాంధీభవన్ లో అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు ఇల్లెందు నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకున్నారు ఆశావహులు.  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మూడు నియోజకవర్గాలకు దరఖాస్తు పెట్టారు.  తన ఆశావాహులు అందరితో దరఖాస్తులను పెట్టించారు. ఇలా చాలా మంది నేతలు రెండు మూడు నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీలు అసెంబ్లీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 


119 అసెంబ్లీ సీట్లకు వెయ్యి అప్లికేషన్లు


తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లు ఉంటే వెయ్యి మందికిపైగా దరఖాస్తులు పెట్టుకున్నారు. కొన్ని నియోజకవర్గాలకు ఒకే ఒక్క అప్లికేషన్ వస్తే పలు చోట్లు నాలుగైదు వచ్చాయ్. ఇంకొన్ని నియోజకవర్గాలకు పదుల సంఖ్యలో అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకున్నారు. దరఖాస్తుల ద్వారానే హస్తం పార్టీ నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఊహించని రెస్పాన్స్ రావడంతో పీసీసీ కొత్త తలనొప్పులు మొదలయ్యాయ్. ఒక్కో నియోజకవర్గానికి నాలుగైదు దరఖాస్తులు రావడంతో ఎవరికి సీటు కేటాయించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. ఒకరికి సీటు ఖరారు చేస్తే మరో వర్గం నుంచి నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. డిమాండ్ ఎక్కువ సప్లయ్ తక్కువ అన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. మొత్తం దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటే ఒక్కో సీటుకు పది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇదే ఇపుడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి ఆశావహులు పరీక్ష పెట్టారు. 


ఎన్నికల గడువు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థులని వీలైనంత త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. వచ్చిన దరఖాస్తులను మొదట పిసిసి ఎన్నికల కమిటీ పరిశీలించనుంది. ఆ తర్వాత ఆయా  నియోజకవర్గాలకు ముగ్గురు అభ్యర్థుల చొప్పున స్క్రీనింగ్ కమిటీకి సిఫార్సు చేయబోతుంది. ఆశావాహుల పేర్ల మీద కూడా సర్వేలు చేయబోతుంది కాంగ్రెస్. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సామాజిక పరిస్థితులు, ప్రజల్లో పేరు, సామాజిక సేవా కార్యక్రమాలు వంటి అంశాలపై ఆరా తీస్తోంది. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వే చేపట్టడంతో దరఖాస్తు చేసుకున్న నేతల్లో టెన్షన్ మొదలైంది. సర్వేల్లో వచ్చిన రిపోర్టుల అధారంగా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది. 


టికెట్ల దక్కని నేతలకు కాంగ్రెస్ పార్టీ ఎలా దారిలోకి తీసుకొచ్చుకుంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. దరఖాస్తు చేసుకున్న వారందరికి టికెట్ ఇవ్వలేమంటున్న హస్తం పార్టీ .ఆశావహులకు ఏం చెప్పబోతోంది. వారికి ఎలాంటి హామీలు ఇస్తుందో వేచి చూడాలి.