అందం, ఎత్తు... ఈ రెండూ ఇప్పుడు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. పొట్టిగా ఉన్న యువత ఆత్మన్యూనతతో బాధపడుతున్నారు. నిజానికి ఎత్తు అధికంగా ఉండడం కూడా అంత మంచిదేమీ కాదు. ఒక మనిషి ఎత్తు వారికి వచ్చే వ్యాధులకు మధ్య సంబంధాన్ని కనుక్కునేందుకు ఎన్నో అధ్యయనాలు జరిగాయి. వాటిలో ఎత్తు ఎక్కువగా ఉండే వ్యక్తులకు కొన్ని రకాల రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ అని తేలింది. పొడవుగా ఉన్న వారిలో గుండె జబ్బులు త్వరగా వస్తాయి. అలాగే అల్జీమర్స్ అంటే మతిమరుపు వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఎక్కువ. ఎత్తు ఎక్కువగా ఉన్నవారు ఇలాంటి జబ్బులు బారిన పడడానికి కారణం ఏంటో మాత్రం పరిశోధనలు చెప్పలేకపోతున్నాయి. ఆ వ్యక్తి ఎత్తు వారసత్వం అంటే జన్యుపరంగా వచ్చేది కాబట్టి, జన్యు విశ్లేషణను చేసి శోధించాల్సి ఉంటుంది. 


పొడవుగా ఉన్న వారిలో గుండె కొట్టుకునే వేగం మారిపోతుంది. కాలి సిరల్లో రక్తం గడ్డ కట్టడం వంటివి కూడా వచ్చే ముప్పు అధికంగానే ఉంటుంది. అలాగే హై బీపీ, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు కూడా వస్తాయి. కాళ్లు, చేతుల్లో నాడులు త్వరగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అందుకే పొడవుగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో అధ్యయనాల్లో ఎత్తు ఎక్కువగా ఉన్నవారికి వందకు పైగా రోగాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తేలింది. ఈ పరిశోధనను దాదాపు రెండున్నర లక్షల మంది పై చేశారు. 


మగవారిలో ఎత్తు 5.9 అడుగులు దాటితే వారు పొడవుగా ఉన్న వారి జాబితాలోకి వస్తారు. వీరికి రక్తం గడ్డ కట్టడం, చర్మ ఇన్ఫెక్షన్లు, ఎముక ఇన్ఫెక్షన్లు కూడా వస్తున్నట్లు చేస్తున్నాయి. ఇక మహిళల విషయానికొస్తే 5.3 అడుగుల కన్నా ఎక్కువ ఉన్నవారు అధిక ఎత్తు ఉన్న స్త్రీల జాబితాలోకి వస్తారు. వీరికి ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.  ఇక పొట్టిగా ఉన్నవారు తమకెలాంటి రోగాలు రావని అనుకుంటే అది పొరపాటే. పొడవుగా ఉన్న వారితో పోలిస్తే పొట్టిగా ఉండే వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎత్తుగా ఉన్న పొట్టిగా ఉన్నా కూడా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.


ఎత్తు పెరుగుదల అనేది జన్యువులపై ఆధారపడి ఉంటుంది. అలాగే చిన్నప్పుడు చేసే వ్యాయామం, ఆహారం కూడా ఎత్తును పెంచుతుంది. చేపలు, టోఫు, నట్స్, సీడ్స్, బీన్స్, పాలు వంటివి ఎత్తును పెంచేందుకు సహకరిస్తాయి. వీటిని తినడం వల్ల పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. పోషకాహార లోపం రాకుండా ఇవన్నీ అడ్డుకుంటాయి. 


Also read: ఈ ఆహారాలను రోజూ తింటే గుండెపోటు బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు



Also read: ముప్పై అయిదేళ్ల వయసు దాటాక స్త్రీ గర్భం దాలిస్తే ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుందా?











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.