Andhra Pradesh And Telangana Floods: ఎడతెరిపి లేని వర్షాలు, వరదల తాకిడికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎవర్నీ కదిలించినా కన్నీటి చిత్రాలే. ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాల ప్రజలు వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితులు రోజురోజుకీ ఘోరంగా మారిపోతున్నాయి. దీనిపై విపక్షాల నుంచి రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి.
పక్క రాష్ట్రం కన్నా బాగా చేశాం: రేవంత్ రెడ్డి
తెలంగాణలోని వరద పరిస్థితులపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సహాయక చర్యలు తీసుకోవడంలో కానీ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో కానీ తెలంగాణ ప్రభుత్వం, అధికారులు చాలా అద్భుతంగా పనిచేశారని అన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడం వల్ల అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని రేవంత్ అన్నారు. ముఖ్యమంత్రిని విమర్శించడం లేదని, ప్రజలు కోలుకోవాలని కోరుకుంటున్నానని చెబుతూనే చంద్రబాబును కార్నర్ చేశారు. ఈ వీడియోను ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా బాగా వాడుకుంటోంది. రేవంత్ మాటలు వైసీపీ చేతికి మంచి ఆయుధం ఇచ్చాయి. మేం కూడా మొదట్నుంచి అదే చెబుతున్నామని ప్రచారం చేస్తున్నారు.
విజయవాడ వరద మ్యాన్ మేడ్ డిజాస్టర్ : వైఎస్ జగన్
వరదల నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ విజయవాడలోని సింగ్ నగర్ ప్రాంతంలో పర్యటించారు. అక్కడి బాధితుల సమస్యలుల అడిగి తెలుసుకుని అనంతరం మీడియాలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు అప్రమత్తంగా వ్యవహించకపోవడం వల్ల, ఆయన అసమర్థత వల్లనే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆరోపించారు. తన హయాంలోనూ వరుసగా మూడేళ్లు 8 నుంచి 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినా విజయవంగంగా ఎదుర్కొన్నామని చెప్పారు. కనీస ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఎక్కడా పునరావాస శిబిరాలు ఉన్నట్టే కనిపించడం లేదని, సహాయక చర్యల కన్నా పబ్లిసీటీకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం దారుణమన్నారు. ఫైనల్‌గా మ్యాన్ మేడ్ డిజాస్టర్‌గా తేల్చేశారు.
Also Read: బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం, నేడు ఈ జిల్లాల్లో కుండపోత - ఐఎండీ
విజయవాడ వరదలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను వైసీపీ తన అధికారికి ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఒకేరకమైన వర్షం, ఒకే రకమైన పరిస్థితులున్నా ఆంధ్రలో కన్నా, తెలంగాణలో నష్టం తక్కువ జరిగిందని రేవంత్ అన్నారు. ప్రభుత్వం అప్రమంత్తంగా ఉండటం వల్లనే నష్టం తగ్గించగలిగామని చెప్పుకొచ్చారు. ఆంధ్రా ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అప్రమత్తంగా లేరని వైసీపీ ప్రచారం చేస్తోంది.
కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు..
మనిషిలోతు వరదల్లో మునిగిపోయి తిండీతిప్పలు లేకుండా ఇబ్బందుల్లో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం ఓ వైపు సాయం చేస్తున్నప్పటికీ ఇంకా సరిపోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బుడమేరు వాగు పొంగడంతో విజయవాడ సిటీలోని కీలక ప్రాంతాలు నీట మునిగాయి. మొదటి ఫ్లోర్ వరకు మునిగిపోయి ఉన్నాయి. ఎక్కడా కరెంట్ లేదు.. పిల్లలకు తాగడానికి పాలు లేవు. వృద్ధులు, వ్యాధిగ్రస్తులు నిద్రాహారాలు లేక అల్లాడిపోతున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా మనిషిలోతు వరద, బోటు అడిగితే కిలోమీటర్‌కి మనిషికి వెయ్యి రూపాయలు అడుగుతున్నారు. పునరావాస శిబిరాలు ఎక్కడున్నాయో తెలియడం లేదని వాపోతున్నారు. హెలిక్యాప్టర్ల నుంచి అన్నం పార్శిళ్లు బురదలో విసిరేస్తే తీసుకోవడం, వ్యాన్ దగ్గర నీళ్ల బాటిళ్లు, అన్నం కోసం కొట్టుకోవడం లాంటి దృశ్యాలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
Also Read: వరద బాధితులకు నారా భువనేశ్వరి సాయం- రెండు రాష్ట్రాలకు చెరో కోటి విరాళం