CM Revanth Review With Central Team: తెలంగాణలో (Telangana) వరదల వల్ల తీవ్ర నష్టం సంభవించిన దృష్ట్యా ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయం విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర బృందాన్ని కోరారు. రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందంతో ఆయన సచివాలయంలో శుక్రవారం భేటీ అయ్యారు. వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరారు. వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలని.. వరద నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.


ఖమ్మంలో కేంద్ర బృందం పర్యటన


కాగా, రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు.. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సలహాదారు కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ఖమ్మం జిల్లాలో పర్యటించింది. ఖమ్మం నగరంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు బృందాలుగా వీడి సభ్యులు పర్యటించి నష్టం అంచనా వేశారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి, కాల్వొడ్డు, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, మోతీ నగర్‌లోని రాజీవ్ గృహకల్పలో ఓ బృందం పర్యటించింది. అటు, రెండో బృందం నగరంలోని దానవాయిగూడెం, తల్లంపాడు - తెల్దారుపల్లి, ఖమ్మం రూరల్ మండలంలోని తనగంపాడు, ప్రకాష్ నగర్‌లో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసింది. వరద కారణంగా కోతకు గురైన పొలాలు, ఇసుక మేటలు వేసిన పొలాలను కేంద్ర బృందం పరిశీలించింది. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.


వరద నష్టం ఎంతంటే.?


ఇప్పటి వరకు వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,032 కోట్ల నష్టం వాటిల్లిందని రేవంత్ రెడ్డి అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా దెబ్బతినగా.. దాదాపు దీని నష్టం రూ.2 వేల కోట్లకుపైగానే ఉంటుందని అధికారులు తెలిపారు. వంతెనల ధ్వంసంతో మరో రూ.700 కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు. పంచాయతీ రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్ల పునరుద్ధరణకు దాదాపు రూ.200 కోట్లు అవసరం అవుతాయని అధికారులు లెక్కగడుతున్నారు. వరదల కారణంగా ట్రాన్స్‌కోకు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. అటు, విద్యుత్ స్తంభాలు, సబ్ స్టేషన్ల రిపేర్ల కోసం దాదాపు రూ.150 కోట్లకు పైగానే నిధులు అవసరం అవుతాయన్నారు. 


అటు, ఏపీ సీఎం చంద్రబాబుతోనూ కేంద్ర బృంద సభ్యులు గురువారం భేటీ అయ్యారు. ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పర్యటించిన బృంద సభ్యులు వరద నష్టంపై అంచనా వేశారు. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు కేంద్ర బృందాన్ని కోరారు. వరదల వల్ల ప్రాథమికంగా రూ.6,882 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్రానికి ఇటీవల నివేదిక అందించారు.


Also Read: Kaushik Reddy and Arikepudi Gandhi:సెగలుపుట్టిస్తున్న శేరిలింగంపల్లి రాజకీయం- వెనక్కి తగ్గని గాంధీ, కౌశిక్‌ - కొనసాగుతున్న ఉద్రిక్తత