Tension in Serilingampally: శేరిలింగంపల్లిలో ఉద్రిక్తత ఇంకా తగ్గలేదు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఇరువురు నేతలు కూడా ఎవరూ తగ్గడం లేదు. అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి వర్గీయులు సై అంటే సై అంటూ కాలు దువ్వుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం ఆదేశాలతో అలర్ట్ అయిన పోలీసులు వీళ్లద్దరి ఇళ్లతోపాటు కీలకమైన నేతల నివాసాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
నువ్వు తగ్గే వరకు నేనూ తగ్గను అన్నట్టు సాగుతోంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి ఎపిసోడ్. పీఏసీ చైర్మన్‌ నియామకంతో మొదలైన పంచాయితీ రెండు రోజులుగా శేరిలింగంపల్లిలో సెగలు పుట్టిస్తోంది. ఇద్దరు నేతలు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారే కావడంతో ఈ పోట్లాటను మిగతా పార్టీలు ఆసక్తితో గమనిస్తున్నాయి. 


కౌశిక్ రెడ్డిసవాల్‌తో మొదలైన వార్‌... రెండో రోజు కూడా తగ్గలేదు. మరోసారి గాంధీ ఇంటికి వెళ్లేందుకు కౌశిక్ రెడ్డి ప్రయత్నించడంతో పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. కీలకమైన నేతల ఇంటి చుట్టూ పోలీసు బలగాలు ఉన్నప్పటికీ కార్యకర్తలు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 


11 గంటలకు శేరిలింగపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఉందనే కారణంతో చాలా మంది కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకున్నారు. కీలకమైన నేతలను పోలీసులు నిలువరించినా సామాన్య కార్యకర్తలు మాత్రం ఆయన ఇంటి వైపుగా దూసుకురావడంతో కాసేపు గందరగోళం నెలకొంది. కొందరు ప్రహరీ గోడలు ఎక్కి ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారందర్నీ పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. 


ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన కీలక బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇంటి నుంచి రాకుండా నిలువరించారు. మాజీ మంత్రి హరీష్‌రావును కూడా పోలీసులు బయటు రానివ్వలేదు. నిన్న రాత్రి పోలీసులకు, తమ కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో తనకు గాయమైందని ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతివ్వలాని రిక్వస్ట్ చేశారు. కుడి భుజానికి చికిత్స తీసుకోవాల్సి ఉందని వారికి వివరించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గమనించిన పోలీసులు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లేందుకు అంగీకరించారు. 


హరీష్‌రావుతో ఓ బృందం పోలీసులు ఆసుపత్రికి వచ్చారు. అక్కడ ఆయన ఫ్యామిలీ తప్ప వేరే వాళ్లను కలవనీయకుండా చేశారు. హరీశ్‌రావు పరామర్శించేందుకు వెళ్తామని వచ్చిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు సునీతా లక్ష్మారెడ్డి, మాలోత్‌ కవితను పోలీసులు అరెస్టు చేసి తరలించారు. 


Also Read: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు


మరోవైపు అరికెపూడి గాంధీ ఇంటికి బీఆర్‌ఎస్‌ రెబల్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వచ్చి మాట్లాడారు. మహిళలను పార్టీ ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శుల చేసిన కౌశిక్ రెడ్డిపై బీఆర్‌ఎస్ చర్యలు తీసుకోవాలని దానం డిమాండ్ చేశారు. గాంధీ తనను టిఫిన్‌కు పిలిచారని అందుకే వచ్చినట్టు చెప్పారు. కౌశిక్‌రెడ్డి సవాల్ చేసి ఇంటికి ఆహ్వానిస్తేనే గాంధీ నిన్న వాళ్ల ఇంటికి వెళ్లారని చెప్పారు. జనాలను రెచ్చగొట్టేందుకు ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తున్న హరీష్‌రావుపై ఉన్న గౌరవం కూడా పోతోందని అన్నారు. 


Also Read: మెదక్, మేడ్చల్ జిల్లాలో బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టు- కౌశిక్, గాంధీ ఇంటి చుట్టూ పోలీసుల పహారా


గాంధీని కలిసేందుకు దానం నాగేందర్‌కు ఎలా పర్మిషన్ ఇస్తారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. తను కూడా వెళ్తానని బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్‌గా అయ్యారని సన్మానించడానికి వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. శాలువా కప్పి వచ్చేనంటూ చెప్పినా పోలీసులు మాత్రం అనుమతి ఇవ్వలేదు. కౌశిక్‌రెడ్డితోపాటు మేడ్చల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ప్రెసిడెంట్‌ శంభీపూర్‌ రాజును పోలీసులు ఇంట్లో బంధించారు. 


Also Read: కౌశిక్ భార్య మాపై పూలకుండీలు విసిరేసింది - అరెకపూడి గాంధీ