Telangana : తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి(SBTET) త్వరలోనే యూనివర్సిటీగా మారనుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల పర్యవేక్షణ కోసం ఏర్పాటుచేసిన సాంకేతిక విద్యామండలిని వర్సిటీగా మారనుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ఇంజినీరింగ్ కాలేజీలుగా హోదా పెంచిన నేపథ్యంలో.. ప్రత్యేకంగా ఆ కళాశాలల నియంత్రణకు ఓ యూనివర్సిటీ అవసరమని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఇప్పటికే గుజరాత్‌లో పనిచేస్తున్న సాంకేతిక విశ్వవిద్యాలయంపై విద్యాశాఖ అధ్యయనం చేసింది.


రాష్ట్రంలో ప్రస్తుతం  173 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో  140 వరకు జేఎన్‌టీయూ-హైదరాబాద్ పరిధిలో ఉండగా.. మరో 15 కళాశాలలకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నడుస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవలే వికారాబాద్ జిల్లాలోని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజిగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ కళాశాల అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు మరో 9 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను కూడా ఇంజినీరింగ్ కళాశాలలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 2025-26వ విద్యాసంవత్సరం నుంచి ఈ కళాశాలలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. 


ఎస్‌బీటెట్ పరిధిలో 114 పాలిటెక్నిక్‌లు..
రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ (SBTET) పరిధిలో ప్రస్తుతం 57 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, 57 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. అయితే ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే అధికారం ఆ బోర్డుకు లేదు. ఈ కారణంగా టెక్నికల్ బోర్డును వర్సిటీగా మారిస్తే భవిష్యత్తులో ఎన్ని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలొచ్చినా సమస్య ఉండదని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. 


జేఎన్‌టీయూహెచ్‌పై తగ్గనున్న భారం..
టెక్నికల్ బోర్డును యూనివర్సిటీగా మార్చడంతో.. జేఎన్‌టీయూహెచ్‌పై పనిభారం తగ్గనుంది. జేఎన్‌టీయూహెచ్‌ కింద ప్రస్తుతం 140 వరకు ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటితోపాటు 80 వరకు ఫార్మసీ కళాశాలలు, మరో 94 మేనేజ్‌మెంట్ కళాశాలలతోపాటు వర్సిటీ కళాశాలలు మరో 8 ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఈ కాలేజీలకు మరిన్ని వస్తే.. యూనివర్సిటీపై భారం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే గుజరాత్‌లోనూ టెక్నికల్ యూనివర్సిటీ (JTU) పనిచేస్తోంది. అదే తరహాలో ఇక్కడా సాంకేతిక విద్యామండలిని తెలంగాణ టెక్నికల్ యూనివర్సిటీ(TTU)గా మారనుంది.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..