Revanth Reddy About Kaleshwaram Project: హైదరాబాద్: తెలంగాణలో లక్ష కోట్లతో నిర్మించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతలపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూచన మేరకు సిట్టింగ్ జడ్జితో విచారణతో జరిపించి, ఇందుకు బాధ్యులు అందరిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. కళ్ల ముందు సజీవ సాక్ష్యంగా ప్రాజెక్టు కనిపిస్తుందన్నారు. ఇసుక మీద బ్యారేజీలు కట్టే టెక్నాలజీ భూమిపై ఎక్కడ ఉందో అర్థం కావడం లేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. గతంలో కాంగ్రెస్ నాగార్జున సాగర్, జూరాల, శ్రీశైలం, శ్రీరాం సాగర్ ప్రాజెక్టులు కట్టాము. దశాబ్దాలుగా అన్ని ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని మా పనితనానికి సజీవ సాక్ష్యాలుగా ఆ ప్రాజెక్టులు నిలిచాయన్నారు.
కట్టిన మూడేళ్లలోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయిందన్నారు. సభా సమావేశాలు పూర్తయ్యాక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బస్సులలో కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు తీసుకెళ్తామన్నారు. ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయింది, దాని వైఫల్యాలు, తరువాత చేయాల్సిన దానిపై సభ్యుల అభిప్రాయాలను తీసుకుంటామని రేవంత్ చెబుతుండగా.. విచారణ చేయించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూచనను స్వాగతిస్తూ.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తామన్నారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత అసహనం..
సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అసహనం వ్యక్తం చేశారు. మేడిగడ్డ, అన్నారంలో ఘోరం జరిగిందని చెప్పడం సబబు కాదన్నారు. వారు ప్రభుత్వంలో ఉన్నారు. టెక్నికల్ టీమ్ ను తీసుకెళ్లి ప్రాజెక్టు మీద విచారణ చేపట్టేందుకు తమకు ఏ అభ్యంతరం లేదన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్దకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకెళ్లి చూపించేందుకు అది టూరిస్ట్ స్పాట్ కాదన్నారు. బీఆర్ఎస్ చేసిన ప్రగతిని చూపెట్టేందుకు కచ్చితంగా తీసుకెళ్లాం. ఈరోజు తప్పు జరిగింది అంటే. నిపుణులతో పర్యవేక్షణ చేయించి పూర్తి నివేదికలు తీసుకుని చర్యలు చేపట్టాలన్నారు. సభలో అన్ని పార్టీల సభ్యులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే ప్రాజెక్టుపై విచారణకు ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. కానీ ప్రజా ప్రయోజనకరమైన ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, వైఫల్యాలపై మాత్రం కచ్చితంగా విచారణ జరగాలన్నారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం..
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేవనెత్తిన అంశం. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి గత ప్రభుత్వం అమలు చేయలేదు. తన పాదయాత్ర సమయంలోనూ ఈ సమస్య దృష్టికి వచ్చిందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అధికారులు, మంత్రులతో కమిటీలు ఏర్పాటు చేసి వచ్చిన నివేదిక ఆధారంగా చక్కెర ఫ్యాక్టరీని తిరిగి పునరుద్ధరిస్తామని శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంఐఎం సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాం అన్నారు. కొందరు మిమ్మల్ని కౌగిలించుకుని నకిలీ చెక్కులు అందించి మోసం చేస్తారు జాగ్రత్తగా ఉండాలన్నారు. మైనారిటీ శాఖకు సంబంధించిన వ్యవహారాలు చూసేందుకు ఓ అధికారిని నియమిస్తామని చెప్పారు.