Padma Awards To AP And Telangana | హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 25న మొత్తం 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. కానీ పద్మ అవార్డులలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతమంది ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించిన మోదీ ప్రభుత్వం తెలంగాణకు కనీసం 5 అవార్డులు  కూడా ప్రకటించకపోవడం సరికాదన్నారు. మేధావులు, ప్రముఖులు, కళాకారులైన చుక్కా రామయ్య, గద్దర్‌, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్‌ తిరుమలరావు లాంటి ప్రముఖులకు పద్మ అవార్డు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వీరిలో ఎవరికీ పద్మ పురస్కారాలు ప్రకటించకపోవడం 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని రేవంత్ అన్నారు. పద్మ అవార్డులలో తెలంగాణపై చూపిన వివక్ష, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలనే భావిస్తున్నారని సమాచారం.


పద్మ పురస్కారాల విజేతలకు రేవంత్ రెడ్డి అభినందనలు


తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌, డాక్ట‌ర్ దువ్వూరి నాగేశ్వ‌ర్‌రెడ్డి, మంద కృష్ణ మాదిగ‌, దివంగ‌త మిర్యాల అప్పారావు, మాడుగుల నాగఫణిశర్మ, కేఎల్ కృష్ణ, రాఘవేంద్రాచార్య పంచముఖికి ప‌ద్మ‌ పుర‌స్కారాలు రావడంపై రేవంత్ రెడ్డి హ‌ర్షం వ్యక్తం చేశారు. ఆయా ప్రముఖులు వారు ఎంచుకున్న రంగంలో చేసిన విశేష సేవలు, కృషి వారిని దేశంలోని ఉన్న‌త పౌర పుర‌స్కారాల‌కు ఎంపికయ్యేలా చేశాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.






ప్రతి ఏడాది పద్మ పురస్కారాలు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటిస్తుంది. 2025 రిపబ్లిక్ డే సందర్భంగా మొత్తం 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది. వీరిలో 7 మందికి దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించింది. 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వ్యాపారం, విద్య, క్రీడలు, కళలు, వైద్యం, సాహిత్యం వంటి విభిన్న రంగాల్లో విశేష కృషి చేసి, ఎంతో సేవ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పౌర పురస్కారాలు ప్రకటించి గౌరవిస్తుంది. 



Also Read: Padma Award 2025: 2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన