Telangana CM Revanth Reddy brother Tirupati Reddy: సాధారణంగా ప్రభుత్వ పథకాల పంపిణీలో ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులే పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారు. అలాగే చేయాలి. కానీ ఎలాంటి పదవి లేకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అన్న అర్హతతో ప్రభుత్వంలో ఎలాంటి పదవి లేకపోయినా, అధికారి కాకపోయినా తిరుపతి రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. తిరుపతి రెడ్డి మంగళవారం తమ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడంతో దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పదివి లేకున్నా కేవలం ముఖ్యమంత్రి అన్న అనే కారణంతో కల్యాణ లక్ష్మి చెక్కులు ఎలా పంపిణీ చేస్తారంటూ ఆయనను నిలదీశారు. ప్రోటోకాల్ ఒకటి ఉంటుందని దాని ప్రకారమే చెక్కులను పంపిణీ చేయాలని కోరారు.
కేసీఆర్ ఇచ్చిన చెక్కులే అవి
తాము ఉన్నన్ని రోజులు ప్రోటోకాల్ పాటించాలని ఆయనను కోరారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వచ్చిన చెక్కులనే ఇప్పుడు ఇస్తున్నారని, కానీ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన తులం బంగారం ఇవ్వడం లేదంటూ మహిపాల్ తీవ్రంగా మండిపడ్డారు. దీంతో పక్కనే ఉన్నవాళ్లు జడ్పీటీసీ మహిపాల్‌ను బుజ్జగిస్తూ మీరు పంచండి అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ తిరుపతి రెడ్డి నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు తెలుసు.. ఇక్కడ న్యూసెన్స్ చేయకు అంటూ హెచ్చరించారు. అనంతరం తిరుపతి రెడ్డినే మిగితా చెక్కులను సైతం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి తీరుపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఎలాంటి పదవి లేకున్నా చెక్కుల పంపిణీలో తిరుపతి రెడ్డి పెత్తనం ఏంటని జనాలు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సీఎం కుటుంబం రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆయనే అంతా అక్కడ
రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఆయనే షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల అధికారులు ప్రతి నిత్యం ఏది జరిగినా ఆయనకు రిపోర్టు చేయాల్సిందే అని వినిపిస్తోంది. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రివ్యూల్లోనూ తిరుపతి రెడ్డి పాల్గొంటున్నారు. ఎవరేం చేయాలో ఆయనే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారని ఆరోపణలున్నాయి. అంతటి పవర్ ఫుల్ లీడర్‌ను కాదని కొడంగల్ లో ఏ అధికారి కూడా పని చేయలేరని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆయననే అన్ని కార్యక్రమాలకు చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానిస్తుంటారని తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో తన అన్న తిరుపతి రెడ్డికి పోలీసులు ఎస్కార్ట్ కూడా ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. పదుల సంఖ్యలో ఖరీదైన కార్ల కాన్వాయ్‌లో ఆయన నియోజకవర్గంలో తిరుగుతుండంపై దుమారం రేగింది. ఆయనకు పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి నియోజకవర్గంలో పర్యటించే వీడియో వైరల్ కావడంతో సీఎం రేవంత్ స్పందించి, తన సోదరులకు ఎస్కార్ట్ ఇవ్వొద్దని ఆదేశించారు. అయినా ప్రతి రోజు ఉదయం పోలీసులు తిరుపతిరెడ్డికి రిపోర్ట్ చేస్తారని స్థానికంగా వినిపిస్తోంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనది కుటుంబ పాలన అని ఆరోపించిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం సీఎం హోదాలో తన అన్నదమ్ములను ముందు పెట్టి పాలన సాగించడం వివాదాస్పదం అవుతోంది.