AP Telangana News: ఏపీ - తెలంగాణ మధ్య గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందడుగు వేశారు. తొలుత ఏపీ సీఎం చంద్రబాబు సమావేశానికి ప్రతిపాదించగా.. అందుకు తాజాగా రేవంత్ రెడ్డి కూడా అంగీకారం తెలిపారు. విభజన చట్టంలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు ప్రతిపాదించిన సమావేశానికి తాను అంగీకరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.


తెలంగాణ ప్రభుత్వం తరపున చంద్రబాబును తాము సాదరంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. జూలై 6న హైదరాబాద్‌లోని మహాత్మాజ్యోతిరావు ఫూలే భవన్‌లో సమావేశం ఏర్పాటు చేసుకొందామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి అధికారికంగా తన అంగీకారాన్ని ఓ లేఖ ద్వారా చంద్రబాబుకు పంపారు. ఎక్స్‌లో ఓ పోస్టు కూడా చేశారు.


‘‘ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన మీరు ఎంతో ప్రత్యేకత చాటుకున్నారు. ఈ టర్మ్‌లో మీరు మరింత మంచి పాలన అందించాలని కోరుకుంటున్నాను. జరగబోయే ముఖాముఖి సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా నేను మీ అభిప్రాయాలను గౌరవిస్తాను. విభజన చట్టంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ అంశాలు పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. ఇది జరగడం కోసం నేరుగా కూర్చొని మాట్లాడుకుంటనే మంచిది. పరస్ఫరం ఆలోచనలు పంచుకోవడం, సమస్యల పరిష్కారం కోసం ఉత్తమమైన మార్గాలను అన్వేషించాలి’’ అని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.