Jaganmohan Reddy  :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి  బెంగళూరు నుంచి తాడపల్లి నివాసానికి తిరిగి వచ్చారు. మధ్యాహ్నం సమయంలో విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్ లతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎయిర్ పోర్టుకు వచ్చారు. వారంతా సీఎం సీఎం అనే నినాదాలు చేశారు. జగన్ వారినందర్నీ పలకరిస్తూ వెళ్లారు. కొంత మంది కార్యకర్తల దగ్గరకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాడేపల్లి నివాసానికి వెళ్లారు. 


ఎన్నికల్లో ఓటమి తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ తాడేపల్లి నివాసంలో ఉన్నారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నికలో కూడా పాల్గొనకుండా పులివెందుల పర్యటనకు వెళ్లారు. అక్కడ మూడు రోజులుగా ఉన్న తర్వాత  బెంగళూరు వెళ్లారు.  కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని ఆయన తిరిగి తాడేపల్లికి వచ్చారు. ఇక నుంచి పార్ట ీఓటమిపై ఆయన సమీక్షలు చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈవీఎంలను నిందిస్తూ కూర్చుకోవడం కన్నా వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఓటమికి కారణాలను విశ్లేషించుకోవడం మంచిదని భావిస్తున్నారు.                          





 


కొంత మంది సీనియర్ నేతలతో జగన్ ఇప్పటికే సమావేశం అయ్యారు. అయితే అవన్నీ క్యాజువల్ మీటింగ్స్. ఓటమికి కారణాలు తేల్చే సమావేశాలను ఇంకా  పెట్టలేదు. ఇప్పుడు నియోజకవర్గాల వారీగా లేదా జిల్లాల వారీగా సమవేశాలు పెట్టాలని అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో  జరిగిన అవినీతి, అక్రమ కేసులు, దాడులు వంటి ఘటనలన్నింటినీ బయటకు తీసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో చాలా మంది నేతలు ఆజ్ఞాతంలోకి వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో క్యాడర్ కు భరోసా ఇచ్చేందుకు జగన్ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన ఘటనల్లో బాధితుల్ని పరామర్శిస్తానని అందరికీ అండగా ఉంటానని ప్రకటించారు.                               


వైసీపీ ఓడిపోయిందని చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం .. మనస్తాపంతో గుండెపోటుకు గురవడం వంటి ఘటనల్లో పెద్ద ఎత్తున జనం చనిపోయారని వారందరికీ ఓదార్పునిచ్చేలా యాత్ర చేస్తానని జగన్ ఇప్పటికే చెప్పారు. డిసెంబర్ లేదా జనవరి నుంచి యాత్ర ప్రారంభమవుతుందని జగన్ చెప్పారు. ప్రభుత్వంపై ఇప్పుడే విమర్శలు చేయబోమని .. తాము సమయం ఇస్తామని .. ఆరు నెలల తర్వాత హామీల అమలును చూసి ఉద్యమిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు.