మహిళల వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్, ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్‌లో బంగారు పతకం సాధించిన ఈషా సింగ్‌లకు తెలంగాణ ప్రభుత్వం నజరానా అందించింది. వీరిద్దరికీ చెరో రూ.2 కోట్ల నగదు బహుమతి రూపంలో అందించాలని నిర్ణయించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నగదు బహుమతితో పాటు ఇంటి స్థలం కూడా కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.
గత నెలలో జరిగిన మహిళల ప్రపంచ చాంపియన్ షిప్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిఖత్ జరీన్ స్వర్ణం సాధించింది. 52 కేజీల విభాగం ఫైనల్స్‌లో ఇండోనేషియాకు చెందిన జుటామస్ జిట్‌పాంగ్‌పై 5-0తో నిఖత్ విజయం సాధించింది. ప్రపంచ చాంపియన్ షిప్ గెలిచిన ఐదో మహిళగా నిఖత్ జరీన్ నిలిచింది. గతంలో మేరీకోమ్ (ఆరుసార్లు), సరితా దేవి, జెన్నీ ఆర్.ఎల్., లేఖ కే.సీ. ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు.
ఇక ఇటీవలే జర్మనీలో ముగిసిన జూనియర్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో ఈషా సింగ్ మూడు స్వర్ణాలు సాధించింది. దీంతో వీరిద్దరినీ సత్కరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.