బోగస్ రేషన్ కార్డులను ఏరిపారేసేందుకు... అసలైన లబ్ధిదారులకు మేలు జరిగేందుకు రేషన్ కార్డు కేవైసీ ప్రక్రియ మొదలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్రలకు  సూచన చేసింది. కొంత మంది చనిపోయినా వారి పేర్లను కుటుంబ సభ్యులను రేషన్ కార్డు నుంచి తొలగించడం లేదని గుర్తించింది. అలాగే పెళ్లి చేసుకుని వేరుపడిన వారు,  వేరే ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన వారికి వచ్చే రేషన్‌ను కూడా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వెళ్లి తీసుకుంటున్నారు. ఇలాంటి వాటిని కట్టడిచేసేందుకు కేవైసీ నమోదును  తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఆదేశాల్లో రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కేవైసీ పూర్తయితే... నిజమైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారనేది తేలుతుంది.  కుటుంబంలోని ప్రతి ఒక్కరు కచ్చితంగా కేవైసీ పూర్తి చేయాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు. రాష్ట్రంలో ఏ ఊళ్లో ఉన్నవారైనా సరే... అక్కడి రేషన్ షాపుకు వెళ్లి కేవైసీ పూర్తి  చేసువచ్చని చెప్తున్నారు.


రేషన్‌ కార్డు కేవైసీకి సెప్టెంబర్‌ 30తో అయిపోయిందని... కేవైసీ చేయించుకోని వారికి రేషన్‌ కార్డులు తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో రేషన్‌ కార్డు లబ్దిదారులు  ఆందోళన చెందుతున్నారు. దీంతో పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. రేషన్‌ కార్డు కేవైసీ ప్రక్రియ కొనసాగుతుందని... కేవైసీ పూర్తిచేసుకునేందుకు ఎలాంటి గడువు  పెట్టలేదని స్పష్టం చేసింది. తుది గడువు విధించారని జరుగుతున్న ప్రచారం నిజం కాదని కుండబద్దలు కొట్టి చెప్తోంది. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని రేషన్‌  వినియోగదారులను సూచించింది. కేవైసీ చేయించుకోకపోతే... కార్డులో పేరు తీసేస్తారన్నది పూర్తిగా అబద్ధపు ప్రచారమే అని కొట్టిపారేసింది. 


తెలంగాణలో రెండు కోట్ల మందికిపైగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. వీరంతా కేవైసీని కంప్లీట్‌ చేసేందుకు చాలా సమయం పడుతుంది. అందుకని ప్రభుత్వం ఇంకా  ఎలాంటి డెడ్‌లైన్‌ విధించలేదు. కానీ తుది గడువు అయిపోయిందంటూ జరుగుతున్న ప్రచారం జరుగుతోంది. తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని పౌరసరఫరాల శాఖ  అధికారులు స్పష్టం చేశారు. అయితే... ఆలస్యం చేయకుండా వీలున్నప్పుడు వెళ్లి... కేవైసీ ప్రక్రియ పూర్తిచేసుకోవాలని మాత్రం సూచిస్తోంది.


రేషన్‌ లబ్ధిదారుల కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం... రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ పౌరసరఫరాల శాఖ... జనవరి వరకు కేవైసీ ప్రక్రియ  పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు... అసలు కేవైసీ ప్రక్రియే వద్దని.. వెంటనే ఆపేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా  మంత్రి గంగుల కమలాకర్‌. రేషన్‌ కార్డుల్లో పేర్లు ఉన్నవారు చాలా మంది ఇతర దేశాల్లో... ఇతర ప్రాంతాల్లో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. కేంద్రం పెట్టిన ఈ కేవైసీ నిబంధన  వల్ల వారందరికీ ఇబ్బంది కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.


కేవీసీ పూర్తయిన తర్వాత రాష్ట్రంలోని రేషన్‌ లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దీంతో నిజమైన లబ్ధిదారులు ఎంత మందో కూడా తేలిపోనుంది. ఇక... తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.