Telangana Civil Supplies Department Clarity On Family Digital Card: తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు (Family Digital Cards) పొందేందుకు పౌరసరఫరాల శాఖ (Civil Supplies Department) ఓ అప్లికేషన్ విడుదల చేసినట్లుగా సోషల్ మీడియాలో సాగుతోన్న ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. అవన్నీ వదంతులే అని.. తెలుగు భాషలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్‌ను ఇప్పటివరకూ రూపొందించలేదని స్పష్టత ఇచ్చింది. డిజిటల్ కార్డుల కోసం ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని తేల్చిచెప్పింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం తెలుగులో ఓ అప్లికేషన్ రూపొందించి అందుబాటులోకి తెచ్చినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడాన్ని ప్రభుత్వం గమనించింది. గ్రామాల్లో రేషన్ కార్డు లేని కుటుంబాలు ఆ దరఖాస్తు పూర్తి చేసి ఆధార్, సభ్యుల జనన ధ్రువీకరణ పత్రాలు, కుటుంబ ఫోటో జత చేసి స్థానిక వీఆర్వోలకు ఇవ్వాలని పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. 


పౌర సరఫరాల శాఖ స్పష్టత


ఈ క్రమంలోనే కొంతమంది దళారులు లబ్ధిదారులతో దరఖాస్తులు నింపిస్తున్నారు. దీంతో మండల కేంద్రాల్లోని జిరాక్స్ సెంటర్లు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద హడావుడి కనిపిస్తోంది. ఈ విషయం ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ దృష్టికి రాగా అవి వదంతులేనని క్లారిటీ ఇచ్చింది. కుటుంబ డిజిటల్ కార్డుల కోసం దరఖాస్తు చేయడానికి పౌర సరఫరాల శాఖ ఎలాంటి అప్లికేషన్ రూపొందించలేదని.. ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. 


అసలేంటీ ఫ్యామిలీ డిజిటల్ కార్డు.?


రాష్ట్రంలో అన్ని సేవలు ఒకే కార్డులో అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డులను తీసుకురావాలని నిర్ణయించింది. రేష‌న్ కార్డు, పింఛ‌ను - స్వ‌యం స‌హాయ‌క సంఘాలు, రైతు భ‌రోసా, రుణ‌మాఫీ, బీమా, ఆరోగ్య శ్రీ‌, కంటి వెలుగు ఇలా అన్నీ సేవలు ఒకే కార్డులో అందుబాటులోకి వస్తాయి. ఈ కార్డులో కుటుంబానికి చెందిన సభ్యుల వివరాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో యునిక్‌ నెంబర్ ఉంటుంది. అన్నీ కలిపి చూపించేలా ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేస్తే ఆ ఫ్యామిలీకి వస్తున్న పథకాలు, ఏ పథకానికి అర్హులో, రేషన్ కార్డు ఉందా లేదా అనే వివరాలు ఇట్టే తెలిసిపోతాయి. 


ఈ క్రమంలో ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ఇప్పటికే కుటుంబాల గుర్తింపునకు సంబంధించి ప్రక్రియ పూర్తైంది. కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పైలెట్ ప్రాజెక్టుగా పరిశీలన చేపట్టారు. ఇందులో భాగంగా అధికారులు తమ వద్ద ఉన్న లబ్ధిదారుల సమాచారాన్ని నిర్థారించుకోవడం సహా కొత్త సభ్యులను జత చేయడం, మృతి చెందిన వారిని తొలగించడం చేశారు. కుటుంబ స‌భ్యుల వివ‌రాల న‌మోదు, మార్పులు చేర్పుల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సీఎం రేవంత్ అధికారుల‌కు సూచించారు. ఎటువంటి పొర‌పాట్ల‌కు తావివ్వ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. కాగా, మహిళే యజమానిగా కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని సీఎం ఇటీవల సమీక్షలో వెల్లడించారు. కార్డు వెనుకాల ఇతర కుటుంబ సభ్యుల వివరాలు ఉండాలని సూచించారు. అయితే, కుటుంబ స‌భ్యులంతా స‌మ్మ‌తిస్తేనే ఆ కుటుంబం ఫొటో తీయాల‌ని, అదో అప్ష‌న‌ల్‌గా ఉండాల‌ని స్పష్టం చేశారు. కుటుంబ సమ్మతి లేకుంటే ఆ ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. 


Also Read: Telangana News: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - HMDA పరిధిలో చెరువుల విస్తీర్ణం గుర్తించేందుకు సర్వే