HMDA Survey on Tanks FTL and Buffer Zones | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. HMDA పరిధిలో చెరువుల విస్తీర్ణం గుర్తించేందుకు సర్వే చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చెరువులు, జలాశయాల FTL, బఫర్ జోన్ల పరిధి, విస్తీర్ణం తేల్చాలని.. సర్వే పూర్తి చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సర్వే పూర్తయిన తరువాత అధికారిక వెబ్ సైట్లో HMDA పరిధిలో ఉన్న చెరువులు, కుంటల విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల వివరాలను పొందుపరచనున్నారు. హైదరాబాద్ లో చెరువులు, హైడ్రా వ్యవస్థ, మూసీ ప్రాజెక్టు అంశాలపై తెలంగాణ సెక్రటేరియట్ లో సోమవారం భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు.


2014 నుంచి ఏ మేరకు కబ్జాలు జరిగాయో వివరాలు..
హైదరాబాద్ లో 920 చెరువులు, కుంటలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి 2014 వరకే 225 చెరువులు పూర్తిగా కబ్జా అయ్యా్యి. మరో 196 చెరువుల భూములు పాక్షికంగా కబ్జాలకు గురయ్యాయి. 499 చెరువులలో ఎలాంటి కబ్జాలు, ఆక్రమణలు జరగలేదని అధికారులు తెలిపారు. గత పదేళ్లలో 2014 నుంచి 2023 వరకు మరో 20 చెరువులు, కుంటలు పూర్తిగా కబ్జా చేశారు. గతంలో పాక్షికంగా ఆక్రమణలకు గురైన మరో 24 చెరువులు పూర్తిగా కబ్జా అయ్యాయి. మరో 127 చెరువుల భూముల్ని వీలైనంత వరకు ఆక్రమించుకున్నారని శాటిలైట్ ఇమేజ్ లు చూపించి వివరించారు. ఇలా జరగడం హైదరాబాద్ కు, నగర ప్రజలకు ఏం చేస్తుందని ప్రశ్నించారు. దీని వల్ల నీటి లభ్యత తగ్గుతుంది, భారీ వర్షాలు, వరదలతో నగర ప్రజలకు సమస్యలు తప్పవని హెచ్చరించారు.




రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్ మెట్ లోని కుంట్లూరులో 2014లో ఉన్న చెరువును పూర్తిగా కబ్జా చేయడాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఫొటోలు, వివరాలతో చూపించారు. ఇవన్నీ గమనిస్తే పూర్తి వివరాలతో హైడ్రా అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి చెరువులు, జలాశయాల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో కూల్చివేతలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.


రేవంత్ ఆస్తికాదు, నా ఆస్తి కాదు.. ప్రజల ఆస్తి


2014లో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలో ఉన్న చెరువు 2023కు వచ్చే సరికి జరిగిన ఆక్రమణను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చూపించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలం ఉప్పల్ భగాయత్ లో చెరువు, కుంట ను పదేళ్లలో ఎలా ఆక్రమించారో శాటిలైట్ ఇమేజ్ ను చూపించి వివరించారు. తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏ మేరకు కబ్జాలు, ఆక్రమణలు జరిగాయో శాటిలైట్ ఇమేజ్ లతో హైదరాబాద్ ప్రజలకు భట్టి విక్రమార్క వివరించారు. ప్రజల ఆస్తి ఏ విధంగా కబ్జా జరిగింది, ప్రస్తుతం ఉన్న చెరువులు, కుంటల భూముల వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించింది.


ఈ చెరువులు రేవంత్ రెడ్డివి కావు, నావి కూడా కావు.. ప్రజల ఆస్తి ఇది. వీటిని ఏం చేయాలో ఇప్పుడు చెప్పాలని ప్రజలను భట్టి విక్రమార్క అడిగారు. ఇకనుంచైనా కబ్జాలు ఆగాలని, లేకపోతే భవిష్యత్తులో మరింతగా పెరిగి ఊహించిన నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఇటీవల రాష్ట్రం తరఫున ప్రపంచ దేశాల్లో కొన్నిచోట్ల నగరం మధ్యలో ఉన్న నదులు, జలాశయాలను ఎలా కాపాడుకుంటున్నారు. వాటి ద్వారా ప్రజల జీవన విధానం ఎలా మారిందో పరిశీలించినట్లు తెలిపారు.


Also Read: Hyderabad News: హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ - నగరానికి ప్రభుత్వం కొత్త నిర్వచనం