అక్టోంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అంతలోపే కీలక నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో  మంత్రి వర్గ సమావేశం జరగనుంది. దీనిపై నేడో, రేపో స్పష్టత రానుంది.ఇదే చివరి మంత్రి వర్గ సమావేశం కావడంతో ఉద్యోగుల వేతన సవరణ సహా పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వేతన సవరణ కోసం కమిషన్‌ను నియమించడంతో పాటు మధ్యంతర భృతి కూడా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు.


మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అవసరం అనుకుంటే అంతకు ముందే ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా  సమావేశం అవనున్నారు. అనాథ చిన్నారుల కోసం ప్రత్యేక విధానాన్ని కూడా ఆమోదించే అవకాశం ఉంది. ఇటీవల జిల్లాల పర్యటనల సందర్భంగా కేసీఆర్ పలు హామీలు ఇచ్చారు. వాటిలో కొన్నింటికి మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. 


గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల కోసం గత మంత్రివర్గ సమావేశంలో తీర్మానించి, దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ కు పంపారు. అయితే తమిళి సై సౌందరరాజన్ ఈ ప్రతిపాదనను  తిరస్కరించారు. వారికి అర్హత లేదని, సమగ్ర వివరాలు లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై గవర్నర్ కు పూర్తి సమాచారం పంపడంపై చర్చించనుంది. 


మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పలువురు నేతలు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. ఏవైనా బిల్లులను వెనక్కి పంపితే ఉభయసభల్లో మళ్లీ ఆమోదించి పంపే వెసులుబాటు ఉంటుందని, నామినేటెడ్ ఎమ్మెల్సీల వ్యవహారంలో నిర్దిష్ట విధానం అంటూ ఏదీ లేదని అంటున్నారు. ప్రభుత్వం ఎలాంటి తీసుకుంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. దాసోసు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను మళ్లీ సిఫార్సు చేయాలని భావిస్తోంది. మంత్రివర్గంలో మళ్లీ రెండు పేర్లను ఆమోదించి.. అన్ని వివరాలతో మళ్లీ రాజ్‌భవన్‌కు పంపే అంశంపై చర్చించనుంది. వీటితో పాటు ఇతర అంశాలు కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. 


సోమవారం రాష్ట్ర మంత్రిమండలి సిఫార్సు ఇద్దరి ఎమ్మెల్సీ పేర్లను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తిరస్కరించారు. మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, భారాస నేత దాసోజు శ్రవణ్‌ల పేర్లను ప్రభుత్వం గవర్నర్‌ ఆమోదానికి పంపగా.. ఆర్టికల్‌ 171(5) మేరకు గవర్నర్‌ నామినేటెడ్‌ కోటా కింద వారిద్దరికీ తగిన అర్హతలు లేవని, కళలు, సాహిత్యం, సైన్స్‌ రంగాల్లో వీరిద్దరూ పనిచేయనందున.. నామినేట్‌ చేయడం కుదరదంటూ.. ఈనెల 19వ తేదీన దస్త్రాలను వెనక్కి పంపారు. సత్యనారాయణ, శ్రవణ్‌ల తిరస్కరణకు కారణాలు వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, సీఎస్‌ శాంతికుమారికి లేఖలు రాశారు. రాష్ట్రంలో ఎందరో అర్హులైన ప్రముఖులున్నా వారిని పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయాలతో సంబంధం ఉన్నవారి పేర్లను సిఫార్సు చేయడం సరికాదని, ఇకపై రాజకీయాలతో సంబంధం లేని అర్హులనే సిఫార్సు చేయాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు.