Telangana Cabinet Key Decisions: రాష్ట్రంలో రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సన్న వడ్లకు రూ.500 బోనస్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన శనివారం జరిగిన కేబినెట్ (Telangana Cabinet) భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల హామీలు సహా మేనిఫెస్టోపై చర్చించింది. ఇప్పటివరకూ వేసిన కేబినెట్ సబ్ కమిటీలు, వాటి నివేదికలపై చర్చించింది. ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ వర్శిటీకి ఎకరానికి రూ.250 చొప్పున భూమిని కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే, మద్దూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయడానికి ఆమోదం తెలిపింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంపుపైనా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలిచ్చింది. ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉస్మానియా ఆస్పత్రి పునఃనిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అటు, మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నాగోల్ - ఎల్బీనగర్ - హయత్‌నగర్, ఎల్బీనగర్ - శంషాబాద్ విమానాశ్రయం వరకూ మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
స్కిల్ వర్శిటీ ఏర్పాటులో కీలక పరిణామం
మరోవైపు, రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) ముందుకు వచ్చింది. మొత్తం స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి సంస్థ తమ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. వీటితో స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్‌లో అవసరమైన భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతలను మేఘా సంస్థ స్వీకరించింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
భట్టి కీలక వ్యాఖ్యలు
అటు, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి మండిపడ్డారు. నరెడ్కో నిర్వహిస్తోన్న ప్రాపర్టీ షోను శనివారం ఆయన సందర్శించారు. మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. నిర్వాసితులకు వారు ఉండే చోట అద్భుతమైన టవర్స్ నిర్మించి.. వారి పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామని తెలిపారు. మూసీ నిర్వాసిత మహిళలతో పాటు నగరంలోని డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. మరోవైపు, స్థిరాస్తి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బ్యాంకర్లతో చర్చించి వారికి రుణాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. హైడ్రాపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Indiramma Houses APP: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ రెడీ: మంత్రి పొంగులేటి