రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ జరిగింది. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించిన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రేపు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆదివారం (ఫిబ్రవరి 5) జరిగిన కేబినెట్ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికపై సమావేశంలో చర్చలు జరిపారు. రేపు (ఫిబ్రవరి 6) అసెంబ్లీలో ఆర్థికమంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మంత్రివర్గ సమావేశం ముగియగానే సీఎం కేసీఆర్ నాందేడ్ బయలుదేరి వెళ్లారు.
ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉన్న వేళ పూర్తి స్థాయి చివరి రాష్ట్ర బడ్జెట్ ఇదే. అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున భారీ పద్దునే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న 2022-23 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది భారీ అంచనాతో రూ.2.52 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది రూ.1,93,029 కోట్ల రెవెన్యూ రాబడులు అంచనా వేయగా.. డిసెంబర్ చివరి నాటికి అంచనాలకు అనుగుణంగానే ఖజానాకు వచ్చాయి.
నేడు మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ
ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నేతల సమక్షంలో భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ అదే దూకుడుతో ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తుంది.
గులాబీమయమైన నాందేడ్ పట్టణం
ఇటీవల ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన పలువురు కీలక నాయకులు బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మాహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలో పలువురు ముఖ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున ఆదివారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. సభస్థలి వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్ పట్టణంతో పాటు సభ స్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
మహారాష్ట్రలోని నాందేడ్ లో ఆదివారం జరపతలపెట్టిన బీఆర్‌ఎస్ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ సీఎం కేసీఆర్ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లను చేశారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, షకీల్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, తదితర నేతలు గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్..
- సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు నాందేడ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
- అక్కడి నుంచి ప్రత్యేక కాన్వయ్‌లో బయలుదేరి సభా వేదిక సమీపంలోని చత్రపతి శివాజీ విగ్రహం వద్దకు చేరుకుంటారు. పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు.
- అనంతరం అక్కడి నుంచి బయలుదేరి చారిత్రక గురుద్వారాను సందర్శిస్తారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
- అక్కడి నుంచి 1.30గంటలకు సభాస్థలికి చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నేతల చేరికలు.
- అనంతరం బీఆర్‌ఎస్ నాందేడ్ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.
- మధ్యాహ్నం 2.30 గంటలకు సభా స్థలి నుంచి స్థానిక సిటీ ప్రైడ్ హోటల్‌కు చేరుకుంటారు.
- భోజనానంతరం 4 గంటలకు జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
- సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు