పిల్లలు పుట్టాక వారి శారీరక ఎదుగుదలే కాదు, మానసిక ఎదుగుదల కూడా ఎలా ఉందో ఎప్పటికప్పుడు గమనించుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. వయసును బట్టి వారి మాట తీరు, వారి భావోద్వేగాలు బయటపడుతూ ఉంటాయి. వయసుకు తగ్గట్టు మాట్లాడడం, అవసరమైనవి నోటితో అడగడం, అందరిని గమనించడం, పరిసరాలను గుర్తించడం, ఇష్టా ఇష్టాలు తెలియజేయడం వంటివన్నీ కూడా మూడేళ్ల తర్వాత అధికంగా ఉంటాయి. అలాంటి పనులేవీ పిల్లలు చేయకుండా నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడుతుంటే, వెంటనే వారిని వైద్యులకు చూపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మూడేళ్లు వయసు దాటిన పిల్లలు తమకు కావలసిన వస్తువును నోటితో అడక్కుండా తల్లిదండ్రుల చేయి పట్టుకొని తీసుకెళ్లి చూపించడం, బాత్రూం కి కూడా తల్లిదండ్రులు చేయి పట్టి తీసుకెళ్లి చూపించడం వంటివి చేస్తుంటే వారు ఏదైనా మానసిక సమస్యతో ఉన్నారేమో అని తెలుసుకోవడం ముఖ్యం. టాయిలెట్ వస్తున్న విషయాన్ని మూడేళ్లు దాటిన పిల్లలు కచ్చితంగా తల్లిదండ్రులకు నోటితో చెబుతారు. అలాగే తమకు కావలసిన చాక్లెట్లు, బిస్కెట్లు లాంటివి నోటితోనే అడుగుతారు. ఇవేవీ తమ పిల్లలు చేయకపోయినా  కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోరు. అది ప్రమాదం. మీ పిల్లల్లో పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే చైల్డ్ సైక్రియాటిస్టులను కలవాల్సిన అవసరం ఉంది. 


ఈ సమస్యల వల్ల...
పిల్లల్లో ADHD లేదా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలు పుట్టుకతో వచ్చే అవకాశం ఉంది. వీటి వల్ల శారీరకంగా పిల్లలు బాగానే ఎదుగుతునా... మానసికంగా మాత్రం వయసుకు తగ్గట్టు ఎదగరు. దీన్ని ఎంత తక్కువ వయసులో గుర్తిస్తే అంత మంచిది. చిన్న వయసులోనే చికిత్స ప్రారంభించడం వల్ల వారికి కొంతవరకు ఇవి నయమయ్యే అవకాశం ఉంది. కానీ ఇలాంటివి పూర్తిగా నయం అవడం అనేది ఉండదు. కాకపోతే వారి పనులు వారు చేసుకునే విధంగా చికిత్సను అందించవచ్చు. 


ఇలాంటి మానసిక సమస్యలకు ఐదేళ్ల వయసులోపే చికిత్స ఆరంభించాలి. అలా ప్రారంభించడం వల్ల మెదడులోని నాడీ కణాల మధ్య అస్తవ్యస్తమైన అనుసంధానాలు తిరిగి సవ్యంగా మారుతాయి. ఒక పిల్లాడిలో ఆటిజం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం కోసం వైద్యులు చైల్డ్ ఆటిజం రేటింగ్స్ స్కేల్ ఆధారంగా అంచనా వేస్తారు. ఈ రేటింగ్ తక్కువగా ఉంటే చికిత్స చాలా సులువు అవుతుంది. అదే రేటింగ్ ఎక్కువగా ఉంటే ఆ పిల్లాడికి మరింత కౌన్సిలింగ్, థెరపీలు అవసరం అవుతాయి. మానసిక సమస్యలు ఉన్న పిల్లలను ఇతర పిల్లలతో కలిసి ఆడుకునేలా చేయడం, మాట్లాడేలా చేయడం, నలుగురిలో మెలిగేలా చేయడం వంటివి థెరపీలో భాగంగా ఉంటాయి.   ‘స్పీచ్ థెరపీ’ కూడా ఇస్తారు. అవసరమైతే తమ పనులు తాము చేసుకునేలా ఆక్యుపేషనల్ థెరపీ కూడా ఉంటుంది. 


ఆటిజం ఉన్న పిల్లలకు బిహేవియర్ థెరిపి అవసరం. ఈ పిల్లలు అదేపనిగా అరవడం, పళ్ళు కొరకడం,అతిగా గెంతులేయడం వంటివి చేస్తుంటారు. అవన్నీ మాన్పించేందుకు ఈ థెరపీ అవసరం పడుతుంది. ఐదేళ్ల వయసుకు ముందే ఈ థెరఫీలు అన్నీ చేయించడం వల్ల నాడీ కణాల మధ్య అనుసంధానాలు త్వరగా సర్దుకుంటాయి. ఆ వయసు దాటితే కష్టమవుతుంది. కాబట్టి మూడేళ్ల వయసున్న పిల్లలు నలుగురిలో కలవలేకపోయినా, వారికి కావాల్సింది నోటితో అడగకపోయినా, కోపంతో పళ్ళు కొరుకుతున్నా, ఒకే పదాన్ని పదేపదే మాట్లాడుతున్నా ఒకసారి చైల్డ్ సైక్రియాటిస్ట్ కి చూపించడం అన్ని విధాలా మంచిది. 


Also read: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి






















































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.