కేక్ తయారీ పద్ధతి సులువుగానే అనిపిస్తుంది. కానీ దానిని వండుతున్నప్పుడే తెలుస్తుంది పర్ఫెక్ట్ గా రావడం ఎంత కష్టమో. సరైన కొలతలను ఉపయోగించి చేస్తేనే కేక్ మెత్తగా, టేస్టీగా ఉంటుంది. సాధారణంగా కేక్‌ని తయారు చేయడానికి మైదాపిండి, వెన్న, గుడ్లు, పాలు, చక్కెర, వెనిల్లా ఎసెన్స్ వంటివి వాడతారు. అలాగే కొంతమంది నిమ్మరసం కూడా కలుపుతారు. అయితే వీటిలో వాడే మైదా, చక్కెర ఈ రెండూ కూడా డయాబెటిక్ రోగులకు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి హాని చేస్తాయి. సాధారణంగా ఈ రెండు అధికంగా తినడం మంచిది కాదు. కాబట్టి ఈ రెండూ వాడకుండా కేకును ఇంట్లోనే తయారు చేయొచ్చు.  అది కూడా ఆరోగ్యకరమైన పద్ధతిలో. 


భారతీయ అల్పాహారాల్లో ఇడ్లీ, దోశలకే ప్రథమ స్థానం. కాబట్టి ప్రతి ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి కచ్చితంగా ఉంటుంది. ఆ పిండితోనే హెల్తీగా కేకును తయారు చేయొచ్చు. అది కూడా చాలా సులువుగా. ఇందులో మైదాగానీ, చక్కెరగానీ వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి మితంగా డయాబెటిక్ రోగులు కూడా ఈ కేకును తినవచ్చు. ముఖ్యంగా పిల్లలకి ఈ కేక్‌ని పెడితే ఎంతో బలం కూడా.


కావలసిన పదార్థాలు 
ఇడ్లీ లేదా దోశ పిండి - ఒక కప్పు 
బెల్లం - ముప్పావు కప్పు 
ఉప్మా రవ్వ - రెండు స్పూన్లు 
కొబ్బరి తురుము - అరకప్పు 
నెయ్యి - రెండు స్పూన్లు 
యాలకుల పొడి - అర స్పూను 
వంట సోడా - పావు స్పూను


తయారీ ఇలా 
1. ఒక గిన్నెలో ఇడ్లీ పిండి లేదా దోశ పిండి వేసి బెల్లం తురుమును వేసి బాగా కలపాలి. 
2. బెల్లం తురుము ఇడ్లీ పిండిలో బాగా కలిసిపోవాలి. గరిటెతో కలిపినప్పుడు బెల్లం బాగా కలవదు అనుకుంటే, బెల్లం, ఇడ్లీ పిండి కలిపి ఓసారి మిక్సీ పట్టొచ్చు.
3. ఆ తర్వాత ఆ మిశ్రమంలో ఉప్మా రవ్వ, కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.  మీరు ఓవెన్లో కే‌క్‌ని రెడీ చేయాలి అనుకుంటే కేక్ మౌల్డ్ పై బేకింగ్ పేపర్ వేయాలి. 
4. ఆ పేపర్ పై నెయ్యి రాసి కాస్త పిండిని చల్లుకోవాలి. ఆ తర్వాత ఆ మౌల్డ్‌లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేకు మిశ్రమాన్ని వేసి ఓవెన్‌లో పెట్టాలి. దాదాపు నలభై నిమిషాలు ఉంచితే కేకు రెడీ అయిపోతుంది. 


కుక్కర్లో...
కుక్కర్లో కేక్ వండాలనుకుంటే... కుక్కర్ అడుగు భాగంలో మెటల్ స్టాండ్ పెట్టాలి. ఆ మెటల్ స్టాండ్ మీద స్టీల్ గిన్నె ఉంచి, ఆ గిన్నెలో కేకు మిశ్రమాన్ని వేయాలి. కుక్కర్ మూతను పెట్టేసి 20 నుంచి 30 నిమిషాల వరకు తక్కువ మంట మీద వేడి చేయాలి. అలా చేశాక ఒక టూత్ పిక్‌తో కేకును గుచ్చి చూడాలి. టూత్ పిక్ కు ఏమి అతుక్కోకుండా వస్తే కేక్ రెడీ అయినట్టే.  
ఇది చాలా హెల్తీ కేక్ రెసిపీ అని చెప్పొచ్చు. ఈ కేక్ తయారీలో వాడినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. కాబట్టి పిల్లలకు ప్రతివారం దీన్ని చేసి పెట్టినా ఎలాంటి హాని ఉండదు. మైదా పిండి, చక్కెర కలిపిన కేకులు తినడం వల్ల భవిష్యత్తులో కొన్ని అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. 


Also read: మూత్రపరీక్షతో బ్రెయిన్ ట్యూమర్ ఉందో లేదో కనిపెట్టేసే కొత్త పరికరం - శాస్త్రవేత్తల సృష్టి