Telangana by elections unlikely: భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా అనర్హతా వేటు వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిది. అదే సమయంలో స్పీకర్ 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఇది ఆదేశమా.. సూచనా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఈ అంశంపై మార్పులు చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. 

పిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీ మారినప్పుడు లేదా విప్ ధిక్కరించినప్పుడు స్పీకర్ అనర్హతా వేటు వేయవచ్చు. ఆ అధికారం ఒక్క స్పీకర్‌కు మాత్రమే ఉంది. స్పీకర్ ను కోర్టులు నిర్దేశించలేవు. భారత రాజ్యాంగంలో  శాసన వ్యవస్థ మొత్తం స్పీకర్ కే అధికారం ఉటుంది. కోర్టులు కూడా ఆయన నిర్ణయాలను ప్రశ్నించలేవు. అలాగే ఫలానా నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించలేవు. చట్టంలో స్పీకర్ కు టైం ఫ్రేం పెట్టలేదు. ఈ టైం ఫ్రేం చట్ట  సవరణ చేసి పెట్టాలని అప్పుడే అ చట్టానికి విలువ ఉంటుందని రాజ్యాంగ నిపుణులు సూచిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. 

అంటే ఇప్పుడు తెలంగాణ స్పీకర్ 90 రోజుల్లో నిర్ణయం తీసుకోకపోయినా అది సుప్రీంకోర్టు ధిక్కారం కిందకు రాదు. ఈ తీర్పును పాటిస్తే.. తర్వాత వివిధ రాష్ట్రాల్లోనూ ఇదే తీర్పు వర్తించే అవకాశాలు ఉన్నాయి. ఇది శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యాన్ని అంగీకరించడమే అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తుంది. అందుకే తెలంగాణ స్పీకర్ సుప్రీంకోర్టు ఇచ్చినవి ఆదేశాలు అయితే ఏం చేస్తారు..? సూచనలు అయితే ఏం చేస్తారన్నదానిపై ఉత్కంఠ ప్రారంభమయింది. అయితే ఇక్కడ ఉపఎన్నికలు రావాలంటే వారిపై అనర్హతా వేటు వేయాలి. ఆ పది మంది ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకోవాలనుకుంటే.. రాజీనామాలు చేయిస్తారు కానీ అనర్హతా వేటు వేయరు. ఉపఎన్నికలు రావాలంటే వారు రాజీనామాలు చేసి ఆమోదింప చేసుకుంటారు. 

అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపఎన్నికలు రావని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. రేవంత్ ఉపఎన్నికలు తీసుకు రావాలని  అనుకుంటే మాత్రం నిర్ణయంలో మార్పు రావొచ్చు. స్పీకర్ ముందు మరో ఆప్షన్ కూడా ఉంది. అది .. బీఆర్ఎస్ పెట్టుకున్న అప్లికేషన్లను తిరస్కరించడం. ఇప్పటికే.. స్పీకర్.. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. వారు తాము పార్టీ మారలేదని వివరణ ఇస్తే.. దాన్నే పరిగణనలోకి తీసుకుని బీఆర్ఎస్ పిటిషన్లను తిరస్కరించవచ్చు. అలాంటి సమయంలో  వారి పదవులు పోవు.. అసెంబ్లీ అధికారిక జాబితాలో వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉంటారు. అయితే అలా చేయడం నైతికత కాదన్న విమర్శలు వస్తాయి. 

ఎలా చూసినా .. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఉపఎన్నికలు వచ్చే అవకాశాలు లేవు. ఒక వేళ ఎమ్మెల్యేల విషయంలో ప్రజా తీర్పు కోరాలని అనుకుంటే.. కాంగ్రెస్ రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకు వెళ్తుంది. అంతే కానీ అనర్హతా వేటు పడే అవకాశాలు ఉండవని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.