Nara Lokesh made key comments on Banakacharla: బనకచర్ల అంశంపై తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారి.. దాన్నో రాజకీయ అంశంగా చేసుకుంటున్నారని నారా లోకేష్ విమర్శించారు. దిగువ రాష్ట్రం.. సముద్రంలోకి పోయే నీళ్లను మళ్లించుకుంటే ఎందుకు వివాదం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ప్రారంభించినప్పుడు అనుమతులు ఉన్నాయా అని ప్ఱశ్నించారు. దిగువ రాష్ట్రంలో ప్రాజెక్టు కడితే ఎగువ రాష్ట్రానికి ఎలా నష్టం జరుగుతుందని ప్రశ్నించారు.
బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీటిని రాయలసీమకు తీసుకెళ్లడం ద్వారా నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ సముద్రంలో వృథాగా పోయే 200 టీఎంసీ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి ఉద్దేశించినదని, ఇది కృష్ణా నది నీటిపై ఆధారపడదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం , బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపిస్తున్నారని, అయితే ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరితమని లోకేష్ విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్ట్‌కు త్వరలో శంకుస్థాపన జరుగుతుందని, దీనిని వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ పేర్కొన్నారు.
వైసీపీ నాయకుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను ధ్వంసం చేశారని, అమరావతి అభివృద్ధికి సింగపూర్‌తో ఒప్పందాలను రద్దు చేసి రాష్ట్రానికి నష్టం కలిగించారని ఆరోపించారు. జగన్ పెట్టుబడులు రాకుండా కుట్రలు చేస్తున్నారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీతో ఒప్పందాలు చేయవద్దని మెయిల్స్ పంపించారని ఆరోపించారు. పెట్టుబడులు, ఉద్యోగాల కోసం 99 పైసలకు భూమి ఇవ్వడంలో తప్పు లేదని, ఈ ఆలోచన ప్రధానమంత్రి నుంచే వచ్చిందని వైసీపీ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై ఉన్నట్లు, ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉందని, రాష్ట్ర అభివృద్ధికి ఈ బ్రాండ్ కీలకమని లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నామని లోకేష్ తెలిపారు. గతంలో వైఎస్ఆర్‌సీపీ నాయకులు తన తల్లిని అవమానించారని, మహిళల గౌరవం విషయంలో వైసీపీ ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు.
లిక్కర్ స్కాంలో పక్కా ఆధారాలు ఉన్నాయని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఓ డి స్టిలరీ కంపెనీ నాలుగు వందల కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేసి లంచాలుగా ఇచ్చిందన్నారు. వారేమీ బంగారంతో లిక్కర్ తయారు చేయరు కదా అని ప్రశ్నించారు. ఆ బంగారం ఎక్కడ ఉందో బయటకు రావాల్సి ఉందన్నారు. లిక్కర్ స్కామ్ లో నగదు.. పెద్దిరెడ్డి కంపెనీలకు వెళ్లిందన్నారు. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కంపెనీ ఖాతాల్లోకి లిక్కర్ స్కామ్ సొమ్ము జ మకాలేదని చెప్పాలని సవాల్ చేశారు. పాపాల పెద్దిరెడ్డికి అన్నీ తెలుసని. పక్కా సాక్ష్యాలతో దొరికిపోయారన్నారు.