Telangana budget 2023 :   తెలంగాణ సర్కార్ కు ఇది ఎన్నికల ఏడాది. రెండో విడత తమ ప్రభుత్వంలో ఇదే చివరి బడ్జెట్. ప్రజల్ని ఆకట్టుకోవడానికి ఇదే చివరి చాన్స్. ఇక బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి  జనాకర్షక పథకాలను ప్రవేశ పెడుతుందో ఊహించడం కష్టం. 2018లో తెలంగాణ సర్కార్ ప్రతీ ఎకరానికి సీజన్‌కు  రూ. నాలుగు వేలు ... ఏడాదికి ఎనిమిది వేలు ఇచ్చేలా రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టి ఆ మేరకు చెక్కులు ఇచ్చి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సారి బడ్జెట్‌లో అలాంటి పథకాలు ఉండనున్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 


భారీగా పెరగనున్న తెలంగాణ బడ్జెట్ !


రాష్ట్రంలోని అత్యధిక కుటుంబాలకు ప్రభుత్వ పథకాలతో చేరువయ్యేలా సరికొత్త రీతిలో 2023-24 బడ్జెట్‌కు రూపకల్పన జరుగుతోంది. 2014-15లో తెలంగాణ తొలి బడ్జెట్‌ 2014 నవంబర్‌ 5న 10 నెలల కాలానికి లక్షా 6వందల 48 కోట్లుగా ప్రతిపాదించగా, 8 ఏళ్ల తర్వాత ఈ బడ్జెట్‌ మూడింతలకు పైగా పెరగనుంది. ఇందులో దళితుల అభ్యున్నతికి తొలి ప్రాధాన్యతగా, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీటవేయనుంది. వ్యవసాయ తోడ్పాటు, మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌ను ఊతంగా చేసుకోనుంది. రాష్ట్రంలోని అత్యధిక కుటుంబాలకు ప్రభుత్వ పథకాలతో చేరువయ్యేలా సరికొత్త రీతిలో 2023-24 బడ్జెట్‌కు రూపకల్పన జరుగుతోంది. 2014-15లో తెలంగాణ తొలి బడ్జెట్‌ 2014 నవంబర్‌ 5న 10 నెలల కాలానికి లక్షా 6వందల 48 కోట్లుగా ప్రతిపాదించగా, 8 ఏళ్ల తర్వాత ఈ బడ్జెట్‌ మూడింతలకు పైగా పెరగనుంది. 
 
సంక్షేమ పథకాలకు భారీ నిధులు ! 


దళితబంధుకు రూ.20 వేల కోట్లతోపాటు, కొత్తింటి పథకానికి రూ.18 వేల కోట్లు, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల పెంపుతోపాటు, పెళ్లి మంటపంలోనే కొత్త జంటలకు ఆర్థిక సాయం అందించేలా కల్యాణలక్ష్మికి మరిన్ని నిధుల పెంపు దిశగా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరగనున్నట్లుగా ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.  రైతుబంధుకు రూ.16 వేల కోట్లు, కేసీఆర్‌ కిట్‌కు, పౌష్టి కాహార పథకానికి రూ.1000 కోట్లు కేటాయించనున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకానికి రూ.3 వేల కోట్లు కేటాయింపులు చేయనున్నట్లు సమాచారం. ఆసరా పింఛన్లు రూ.12 వేల కోట్లకు మించనున్నాయి. రానున్న బడ్జెట్‌లో సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వనున్న ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు మోటార్‌ సైకిళ్ల వంటి పథకంతోపాటు, గీత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పథకం ప్రకటించనున్నట్లుగా చెబుతున్నారు.  కేసీఆర్‌ పోషకాల కిట్‌కు, ఆరోగ్య సంరక్షణ కిట్‌లకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించనున్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం, జలమం డలి ఉచిత నీటి పథకానికి, వైద్య,ఆరోగ్య శాఖకు రూ.15 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. 


బడ్జెట్‌లో పెట్టడం కాదు ఖర్చు చేసి చూపించాల్సిన పరిస్థితి !


ఎన్నికలు ఏడాది చివరిలో జరుగుతాయి. అందు వల్ల ఈ సారి భారీగా కేటాయింపులు చేసి.. ప్రజలకు అవే చూపించి ఓట్లు పొందే పరిస్థితి లేదు. ఎన్నికలకు వెళ్లే సమయానికల్లా పథకాలను అమలు చేయాల్సి ఉంటుంది. అమల్లో ఉంటేనే ప్రజలు నమ్ముతారు. ఎన్నికల తర్వాత అమలు చేస్తామంటే నమ్మకపోవచ్చు. అందుకే..,తెలంగాణ  ప్రభుత్వం ఈ సారి బడ్జెట్ విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని చెప్పవచ్చు. ఓ వైపు ప్రజల ఆకాంక్షలు.. మరో వైపు ఆర్థిక పరిస్థితులు.. కలగలిసి బడ్జెట్ కత్తిమీద సాములా మారిందని అనుకోవచ్చు.