Tension in Nampally Fire Accident Area: నాంపల్లి అగ్ని ప్రమాద ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ రాగా, ఎంఐఎం నేతలు, కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వారించినా వినక పోవడంతో లాఠీలకు పని చెప్పారు. స్వల్ప లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. అనంతరం ఫిరోజ్ ఖాన్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం నేతలు తనను అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరోజ్ ఖాన్ ను అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ఖండించారు.



సమగ్ర విచారణకు డిమాండ్


మరోవైపు, ప్రమాద స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు వీహెచ్ ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ సందర్శించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హైదారాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలిచి వేసిందని, మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అన్నారు.


తీవ్ర విషాదం


హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్ లో సోమవారం ఉదయం 9:30కు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ రసాయన గోదాంలో అగ్ని ప్రమాదం జరిగి ఐదో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో 9 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఓ చిన్నారి ఉన్నారు. కొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 21 మంది అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందిస్తామని, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపడతామన్నారు. ప్రమాదంలో ఆస్తి నష్టపోయిన వారికి సైతం ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో రసాయనాలు నిల్వ ఉంచారని, వీటికి మంటలు అంటుకోవడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు చెప్పారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని, పూర్తి స్థాయి నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


Also Read: Fire Accident In Nampally: నాంపల్లి ప్రమాదంతో అంతులేని విషాదం - మృతుల్లో 4 రోజుల పసికందు, పరారీలో భవన యజమాని