Telangana BJP : తెలంగాణ బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం పెద్ద షాక్‌లా మారింది. ఆయన గత ఏడాది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరి మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేశారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఆయనను బీజేపీ హైకమాండ్ ఆపలేకపోయింది. బీజేపీలో పలువురు ీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేయడం లేదు.


మొదటి జాబితా ప్రకటన తర్వాత పలువురు అసంతృప్తి                            


ముథోల్ టిక్కెట్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి చేరిన వారికి కేటాయించారని..  నిర్మల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షులు రమాదేవి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ముధోల్‌ సీటును ఆశించి భంగపడిన ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ధర్మపురి  నుంచి టిక్కెట్‌ ఆశించిన మాజీ ఎంపీ వివేక్‌కు బీజేపీ అక్కడ కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా చెన్నూర్‌ స్థానాన్ని కేటాయించింది. దీంతో ఆయన పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు.  భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ కూడా బీజేపీని వీడనున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. మునుగోడు లేదా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి తనకు టిక్కెట్‌ కేటాయించాలంటూ ఆయన కోరారు. ఆ మేరకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. దీనికి బీజేపీ అధిష్టానం అంగీకరించకపోవటంతో నర్సయ్య ఇప్పుడు అలకబూనారు.  


మహబూబ్ నగర్‌లో డీకే అరుణ, జితేందర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు            


 మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి పోటీ పడుతున్న మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి… ఇద్దరూ పార్టీకి తలనొప్పిగా మారారు. గద్వాలలో సీనియర్‌ న్యాయవాది అయిన వెంకటాద్రి రెడ్డిని నిలబెట్టి… తనకు ఎంపీగా అవకాశమివ్వాలని అరుణ కోరుతున్నారు. ఇదే సమయంలో తన కుమారుడు మిథున్‌రెడ్డికి షాద్‌నగర్‌ అసెంబ్లీని కేటాయించి, తనకు లోక్‌సభకు అవకాశం కల్పించాలంటూ జితేందర్‌రెడ్డి కోరుతున్నారు. ఇద్దరూ లోక్ సభ టిక్కెట్ అడుగుతున్నారు. జితేందర్ రెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయాలని బీజేపీ హైకమాండ్ కోరుతోంది. కానీ ఆయన దానికి ససేమిరా అంటున్నారు.  గోషామహల్‌ నుంచి పార్టీ టికెట్‌ ఆశించి భంగపడిన విక్రమ్‌గౌడ్‌ కూడా బీజేపీపై గుర్రుగా ఉన్నారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగోతంది. 


పెద్దగా పట్టించుకోని బుజ్జగింపుల కమిటీ                       


 కీలక నేతలందరూ అలకలు, అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో బీజేపీకి మరిన్ని దెబ్బలు తగలటం ఖాయంగా కనబడుతున్నది. అయితే కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ కేటాయింపుల కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఎక్కువ మంది బీజేపీ సీనియర్ నేతలు అసెంబ్లీకి పోటీ చేయాలనుకోవడం లేదు. పార్లమెంట్ కు పోటీ చేస్తామని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో కానీ ఇప్పుడైతే బీజేపీలో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. బుజ్జగింపు కోసం సనియర్ నేతలు ఎవరూ పెద్దగా చొరవ తీసుకోవడం లేదు.