తెలంగాణలో రైతుల సమస్యలపై ప్రయోజనాల విషయం పక్కనపెడితే రాజకీయ పార్టీలు మాత్రం తమ మైలేజీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల తరువాత జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి నిరాశే ఎదురైంది. మరోవైపు అధికారంలోకి రావాలని చూస్తోన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం రైతుల సమస్యలపై నినదిస్తున్నాయి.
వరి ధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకే రాష్ట్ర బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపు, ఎల్లుండి జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్న ఆయన రాత్రి సూర్యాపేటలో బస చేయనున్నారు. అర్జాలబావి ఐకేపీ సెంటర్ (నల్గొండ రూరల్ మండలం)ను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకుంటారు.
అనంతరం మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలుసుకుని వారు సాగు చేస్తున్న పంటలు, మద్దతు ధర, ప్రభుత్వ సహకారం అందుతుందా లాంటి వివరాలు తెలుసుకుంటారు. రాత్రి సూర్యాపేటలో బండి సంజయ్ బస చేయనున్నారు. నవంబర్ 16న తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో పర్యటించి మార్కెట్ లో ధాన్యం అమ్మకంలో ఎదురవుతున్న ఇబ్బందులు, కనీస మద్దతు ధర రాక రైతులు పడుతున్న కష్టాలను పరిశీలించనున్నారు.
Also Read: టీఆర్ఎస్, బీజేపీలకు మాత్రమే అనుమతులా.. కాంగ్రెస్‌కు ఎందుకివ్వరు: రేవంత్ రెడ్డి సూటిప్రశ్న
టీఆర్ఎస్ ప్రభుత్వం వరి వేయకూడదని చెబుతుండగా రైతుల నుంచి కచ్చితంగా వరి కొనుగోలు చేయాలని, మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ నేతలు ఇటీవల ధర్నా చేశారు. సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉండాల్సింది పోయి, కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని బండి సంజయ్ హితవు పలికారు.
బీజేపీ ధర్నా ఎఫెక్ట్‌తో తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రంపై తాము పోరాటం చేస్తున్నామని పేర్కొంటూ టీఆర్ఎస్ నేతలు సైతం ఒకరోజు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి వరి కొంటామని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలవలేనప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనంటూ సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: గళమెత్తాల్సిన సమావేశాలకు గైర్హాజర్ ! కేసీఆర్ రాజకీయం చేస్తున్నారా ? తెలంగాణ ప్రయోజనాల కోసమా ?