TS BJP  In Delhi :   తెలంగాణకు కుటంబ పాలన నుంచి విముక్తి కల్పిస్తామని  బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ మినీ కోర్ కమిటీ సభ్యులు ఢిల్లీలో అమిత్ షా తో భేటీ అయ్యారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన తరుణ్ చుగ్.. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై అమిత్ షాతో చర్చించామని.. తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్తామని తరుణ్ చుగ్ ప్రకటించారు. 





ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ  బీజేపీ అధ్యక్షుడు  బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీకి అభ్యర్థులు లేరని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లోలా మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని  బండి సంజయ్ స్పష్టం చేశారు.   ఈ మేరకు 119 నియోజకవర్గాల్లో బహిరంగసభలు పెట్టాలని నిర్ణయించుకున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం బూత్ స్థాయి వరకు పనిచేస్తున్నామని అన్నారు. ప్రజాగోస, బీజేపీ భరోసా, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అంటూ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా స్పందించేది బీజేపీ పార్టీనే అని బండి సంజయ్ పేర్కొన్నారు. 


  అమిత్ షాతో జరిగిన సమావేశంలో   కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, అర్వింద్, పార్టీ ముఖ్య నేతలు మురళీధర్ రావు, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయశాంతి, ఇంద్రసేనారెడ్డి, జితేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు హాజర్యాయుర.  రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధత, పార్టీ బలోపేతంపై  సుదీర్ఘంగా చర్చించారు.                                          


రాయపూర్‌లో జరిగిన ప్లీనరీ సమావేశంలో  కలసి వచ్చే పక్షాలతో వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.  ఈ క్రమంలో తెలంగాణలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ కలిసి పని చేసే అవకాశం ఉందని బీజేపీ అగ్రనాయకత్వం అంచనా వేస్తోంది. ఎన్నిక‌ల త‌ర్వాత పొత్తు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని సీనియ‌ర్ నేత‌, ఎంపీ కోమ‌టిరెడ్డి వంటి నేత‌లు బ‌య‌ట కామెంట్ చేసిన‌ప్ప‌టికీ, జాతీయ రాజ‌కీయాల దృష్ట్యా ముందే పొత్తులుంటాయ‌ని ఏఐసీసీ అగ్ర‌నేత‌లు ఆఫ్ ది రికార్డు కామెంట్స్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో బీజేపీ అధిష్టానం అల‌ర్ట్ అయిన‌ట్లు తెలుస్తోంది.అదే జరిగితే కాంగ్రెస్-బీఆర్ఎస్ పొత్తును ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, వారు ఒక్క‌టైతే బీజేపీ ఫోక‌స్ ఎలా ఉండాలి... ఇలా ప్ర‌తి అంశంపై డీప్ డిస్క‌ష‌న్ తో పాటు బీజేపీ పెద్ద‌లు డైరెక్ష‌న్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.