Rajasingh On Arvind : తెలంగాణ బీజేపీలో మరోసారి అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తప్పుబట్టారు.  కవితపై చేసిన వ్యాఖ్యల్ని బండి సంజయ్ వెనక్కి తీసుకుంటే బాగుంటుందని సూచించారు. అర్వింద్ వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ మీద అరవింద్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  


"అర్వింద్ కు ఏమైనా ఇబ్బంది ఉంటే బండి సంజయ్ తో డైరెక్ట్ గా మాట్లాడాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆయనతో మాట్లాడొచ్చు. మీరు కూడా ఎంపీ, ఆయనతో దిల్లీలో కలుస్తుంటారు. కానీ డైరెక్ట్ మీడియాలో వచ్చి మాట్లాడడం తప్పు. మీరు చెప్పిన మాటలు వెనక్కి తీసుకోవాలని అర్వింద్ ను కోరుతున్నాను. మీరు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడాలని సూచిస్తున్నాను." - రాజాసింగ్  


ఎంపీ అర్వింద్ ఏమన్నారంటే? 


బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించబోనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. తెలంగాణలో సామెతలు చాలా ఉంటాయని, వాటిని జాగ్రత్తగా వాడాలని బండి సంజయ్ కు బీజేపీ ఎంపీ అర్వింద్ సూచించారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదన్నారు. కవితపై చేసిన వ్యాఖ్యల్ని బండి సంజయ్ వెనక్కి తీసుకుంటే బాగుంటుందని సూచించారు. అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగడం కంటే దర్యాప్తు సంస్థలు, విచారణ సంస్థలు అడిగిన విషయాలకు సమాధానాలు చెబితే బెటర్ అని వ్యాఖ్యానించారు.


బండి వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదు 


బండి సంజయ్ వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదన్నారు ఎంపీ అర్వింద్. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తాను చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ ఇచ్చుకోవాలన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం అంటే పవర్ సెంటర్, పవర్ హౌస్ కాదని, కో ఆర్డినేషన్ చేసుకోవడం వారి బాధ్యత అన్నారు. కనుక ఇష్టరీతిన మాట్లాడకూడదని సూచించారు. కవితపై చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ఉపసంహరించుకుంటే మంచిదన్నారు.   


బండి సంజయ్ కు మహిళా కమిషన్ నోటీసులు 


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజ‌య్‌ కుమార్ కు రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు జారీ చేసింది. మార్చి 15న ఉద‌యం 11 గంట‌ల‌కు కార్యాలయంలో వ్యక్తిగ‌తంగా విచారణకు హాజ‌రు కావాల‌ని మహిళా క‌మిష‌న్ బండి సంజయ్ ను ఆదేశించింది. ఓ సమావేశంలో కవితపై విమర్శలు చేస్తూ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని  బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది.  ఈ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై  మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యల్ని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. విచారణకు కూడా ఆదేశించింది. సంజయ్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ మహిళా ప్రజాప్రతినిధులు జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు.