Telangana Assembly Session CM Revanth Reddy: కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఓటు వేశారని, ఈ తీర్పుతో మొన్నటివరకు ఉన్న పాలకులకు ప్రజాభిప్రాయం అర్థం కావడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజల తీర్పును శిరసావహించాలన్న ఆలోచన, ధ్యాస లేదన్నారు. గతంలో పలుమార్లు మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు చేసిన అనుభవం ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదన్నారు. కుటుంబానికి తప్పా, అర్హులకు ఇక్కడ స్థానం లేదని చర్చ జరపడం ద్వారా బీఆర్ఎస్ కుటుంబ పార్టీగానే కొనసాగుతోందని, ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వడం లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రసంగానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుతగలడంతో వెంటనే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని.. సభ్యులు అంతా సహకరించాలని కోరారు.


ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతం, కడుగుతం అని శ్రీశ్రీ మాటల్ని గుర్తుచేశారు. ప్రజలు కుటుంబపాలనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని ఇకనైనా గుర్తించాలన్నారు. ప్రభుత్వంలో ఉన్న పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేసిన ప్రజలే మమ్మల్ని ప్రతిపక్షం నుంచి అధికారంలోకి తెచ్చారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా భవన్ కు వచ్చి ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటుంటే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రగతిభవన్ ముందు ఉన్న గేట్లను బద్ధలుకొట్టి, మేం ప్రజలకు అవకాశం ఇచ్చామన్నారు. గతంలో సామాన్యులకు మాత్రమే కాదు, నేతలకు సైతం ఇందులోకి ప్రవేశం ఉండేది కాదన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు వెళ్తే.. ఒక హోం గోర్డు మీకు ఇక్కడ అనుమతి లేదని చెప్పారని రేవంత్ గుర్తుచేశారు.



ఈటల రాజేందర్ వెళ్లినప్పుడు సైతం ఆయనకు సైతం ప్రవేశం లేదని, సహచర మంత్రిని అవమానాలకు గురిచేశారు. ఈ విషయాన్ని 4 కోట్ల ప్రజలకు ఈటల చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజా యుద్ధనౌక, ఉద్యమ నేత గద్దర్ ను సీఎం కేసీఆర్ ను కలిసేందుకు మండుటెండలో నిల్చుంటే.. ఆయనకు సైతం ప్రవేశం లేని ప్రజాభవన్ లోకి రాష్ట్ర ప్రజలు అందరికీ ప్రవేశం తమ ప్రభుత్వం కల్పించిందన్నారు. ఉద్యమనేతలకు, మంత్రులకు సైతం ప్రవేశం కల్పించిన ప్రగతి భవన్ గేట్లు బద్ధలుకొట్టి తాము రాష్ట్ర ప్రజలందరికీ ప్రవేశం కల్పించామని రేవంత్ రెడ్డి చెప్పారు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు తొలి రోజు నుంచే అమలుకు కట్టుబడి ఉన్న పార్టీ తమదన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీ ఇవేమీ పట్టవన్నట్లుగా, వారం రోజులు పూర్తవ్వకముందే కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేయడం చూస్తే నవ్వొస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.


ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తొలి కేబినెట్ భేటీలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించామన్నారు. మంత్రివర్గంలో తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలను చట్టబద్దం చేసేది శాసనసభ్యులు అందరూ అని చెప్పారు. బీఆర్ఎస్, ఎంఐఎం సలహాలు తీసుకుని చట్టాలు చేస్తామని.. ఈ విషయం మేనేజ్ మెంట్ కోటాలో అసెంబ్లీకి వచ్చిన వారికి అర్థం కావంటూ సెటైర్లు వేశారు. 


Also Read: కొందరు ఎన్‌ఆర్‌ఐలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదు- కేటీఆర్‌పై రేవంత్ సెటైర్‌లు