తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు మొదటి విడతలోనే వాడీ వేడి చర్చ సాగుతోంది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చలో భాగంగా కేటీఆర్‌, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య తీవ్ర చర్చ జరిగింది. ఓటింగ్ పర్సంటేజ్‌ చెబుతున్న కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. 


కొందరు ఎన్‌ఆర్‌ఐలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే కేసీఆర్ ఎదిగారని గుర్తు చేశారు.  
గత 9 ఏళ్ల పాలన గుర్తుచేస్తున్న వారికి అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం గురించి చెప్పాలని కేటీఆర్‌ సభలో చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం జరిగిన అరాచకాలను కూడా గుర్తు చేసుకోవాలన్నారు. ప్రగతి భవన్‌కు వెళ్లి అక్కడ కేసీఆర్‌ పేరుపై మట్టి పూసినట్టుగా చరిత్రను చెరిపేయలేమన్నారు కేటీఆర్. వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయన్నారు. తెలంగాణకు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు కేసీఆర్‌ అని చెప్పుకొచ్చారు. తెలంగాణ తల్లి సంకెళ్లను తెంచిన కొడుకు కేసీఆర్‌ అంటూ అభిప్రాయపడ్డారు. గవర్నర్ చెప్పినట్టు మార్పు మొదలైంది నిర్బందం పోయిందన్నారని వారి అన్నట్టుగానే 2014 జూన్ రెండు నాడే నిర్బంధం పోయిందని గుర్తు చేశారు. 


శ్రీ శ్రీ చెప్పినట్టు బానిసకొక బానిసకొక బానిస అన్నట్టు తెలంగాణను పీడించిన వాళ్లు పోయినా వారిని తలుచుకునే వాళ్లు మాత్రం ఇక్కడే ఉన్నారని ఎద్దేవా చేశారు. తాము 39 మంది, వాళ్లు 65 మంది ఉన్నారని మిడిసి పడుతున్నారని ఇది మంచిది కాదన్నారు. వాళ్లకు తమకు మధ్య తేడా 1.85 ఓటు మాత్రమే అన్నారు. దీనికే ఈ మాత్రం మిడిసిపాటు వద్దని చెప్పారు. 


కేటీఆర్‌కు కౌంటర్‌గా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొంంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం అవగాహన కాదు అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో 49కి సున్నా విలువ ఉంటుందని... 51 శాతానికి 100 శాతం వాల్యూ ఉంటుందని అభిప్రాయపడ్డారు. 51 శాతం ఉన్న వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని... 49 శాతం ఉన్న వాళ్లు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం చేసే నిర్ణయాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు. ప్రభుత్వం పెడచెవిన పెడితే నిరసనలు చేపడతారు. అవసరమైతే అమరణ దీక్షలు చేస్తారు. ఆ స్పిరిట్‌ను తీసుకోకుండా వాళ్లు 65 మంది ఉన్నారు... మేము 39 మంది ఉన్నాం మేం పోడియంలోకి వచ్చి కుస్తీలు వచ్చిన కొట్లాడతామంటే ఇక్కడ కుదరదు అన్నారు. ఇలాంటి భాష వాళ్లు గౌరవానికి సభను నడిపించడానికి బాగోదన్నారు. 


గత పాలనలో యూత్ కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా కేసీఆర్‌కు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్‌గా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే ఓడిపోయింది కేసీఆర్. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ, షిప్పింగ్ మినిస్ట్రీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆ తర్వాత కేసీఆర్‌కు కార్మిక శాఖ మంత్రిగా చేసింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన హరీష్‌ను ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్యేగా గెలిపించిందని కాంగ్రెస్ పార్టీ అన్నారు. పోతిరెడ్డి పాడు విషయంలో కొట్లాడింది పీజేఆర్ మాత్రమే అన్నారు. సొంత పార్టీ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ ప్రజల హక్కుల కోసం పీ జనార్దన్ రెడ్డి పోరాడారు. ఇక్కడ ఉన్న వాళ్లు ఎవరూ మాట్లాడలేదన్నారు. 


కేసీఆర్ గురువు చంద్రబాబు పార్టీతో పొత్తు పెట్టుకొని కేటీఆర్ గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారని ఎత్తిపొడిచారు. చీమలు పెట్టినపుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్‌రెడ్డి పార్టీని బలోపేతం చేస్తే అక్కడకు ఎన్‌ఆర్‌ఐ(నాన్‌ రిలయబుల్‌ ఇండియన్ ) కోటాలో ఇక్కడకు వచ్చి టికెట్‌ తీసుకొని కేటీఆర్‌ ఎమ్మెల్యే అయ్యారు. మహేందర్‌ రెడ్డికి అన్యాయం చేశారు. 


గతం గురించి చర్చింలానే ఆలోచన ఉంటే ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసుకొని 2014 జూన్ 2  కంటే ముందు అంశాలపై సమగ్రంగా చర్చిద్దామన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత పరిస్థితులపై చర్చిస్తున్నామని దానికే కట్టుబడాలని సూచించారు. గవ‌ర్నర్‌ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఉందని అంటున్నారు. మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాత ఇచ్చిన స్క్రిప్టునే చదువుతారని అందరికీ తెలిసిందే. గతంలో పాలనలో కీలక పాత్ర పోషించిన వారు కూడా ఇలా విమర్శించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. 


9 ఏళ్ల పాటు జరిగిన ఆర్థిక విధ్వంసంపై చర్చిద్దామన్నారు రేవంత్‌రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి కలిసి రావాలంటే చర్చలో పాల్గొనాలని సూచించారు. అంతేకానీ పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు అన్నారు. ఎప్పుటి నుంచో ఈ శాపనార్థాలు చూస్తున్నామన్నారు. పాలక పక్షంగా విజన్ డాక్యుమెంట్‌ను సభలో పెట్టామని... దానిపై సలహాలు సూచనలు ఇవ్వాలని హితవుపలికారు.