Women Reservation Bill 2023:



మహిళా రిజర్వేషన్‌లు..


లోక్‌సభ ఎన్నికల ముందు (Lok Sabha Elections 2024) మరోసారి మహిళా రిజర్వేషన్‌లపై (Women Reservatiob Bill) ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవలే ఈ బిల్ ఆమోదం పొందింది. అయితే...ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారన్న విషయంలో మాత్రం స్పష్టతనివ్వలేదు కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి చేస్తుందని, ఆ తరవాతే మహిళా రిజర్వేషన్‌లు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. దక్షిణ కన్నడ జిల్లాలో రాణి అబ్బక్క స్టాంప్‌ విడుదల కార్యక్రమానికి హాజరైన సీతారామన్...ఈ విషయం చెప్పారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. మహిళా రిజర్వేషన్‌లు కచ్చితంగా అమల్లోకి రావాలని ఆకాంక్షించారు. దేశ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారని, ఇదే విషయాన్ని ప్రధాని మోదీ విశ్వసిస్తారని అన్నారు నిర్మలా సీతారామన్. పోర్చుగీసులతో పోరాడిన రాణి అబ్బక్కనూ పొగడ్తల్లో ముంచెత్తారు. అప్పట్లో పోర్చుగీసు వాళ్లపై ఆమె పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. పెద్దగా ప్రచారంలో లేని చాలా మంది స్వాతంత్య్ర సమర యోధుల గురించి వివరాలు సేకరించి అందరికీ తెలియజేయడంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుందని వెల్లడించారు. 


"మహిళా రిజర్వేషన్‌లు తప్పకుండా అమల్లోకి రావాలి. భారత దేశ నిర్మాణంలో మహిళల పాత్ర మరువలేనిది. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఆయన వల్లే ఈ బిల్లు ఆమోదం పొందింది. వచ్చే ఏడాది జనాభా లెక్కల ప్రక్రియ చేపడతాం. ఆ తరవాతే మహిళా రిజర్వేషన్‌లు అమల్లోకి వస్తాయి"


- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి


మహిళా పోరాట యోధులు..


అమృత్ మహోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దాదాపు 14,500 మంది స్వాతంత్య్ర సమర యోధులకు సంబంధించిన సమాచారాన్ని డిజిటలైజ్‌ చేసినట్టు వెల్లడించారు నిర్మలా సీతారామన్. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మహిళల గురించి ప్రత్యేకంగా మూడు పుస్తకాలు తీసుకొచ్చినట్టు చెప్పారు. కర్ణాటకలో రాణి అబ్బక్క పేరిట సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 


 దేశంలో సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం 2023లో లభించింది. దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ అయిన మహిళా రిజర్వేషన్  బిల్లు ఈ ఏడాదే ఆమోదం పొందింది. లోక్ సభ, ( Loksabha )  రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించే  రాజ్యాంగ (128వ సవరణ) బిల్లు-2023పై లోక్‌సభలో ఈ ఏడాది ఆమోదించింది.   ఓటింగ్‌లో బిల్లుకు ( Voting ) అనుకూలంగా 454 ఓట్లు రాగా, ఇద్దరు మాత్రం వ్యతిరేకంగా ఓటేశారు. ఆ ఇద్దరూ మజ్లిస్ పార్టీకి చెందిన వారు. లోక్‌సభ, రాష్ట్రాల్లోని అసెంబ్లీలు, జాతీయ రాజధాని ప్రాంతం దిల్లీ అసెంబ్లీలో మూడో వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయని ఈ బిల్లు చెబుతోంది. అంటే, 543 లోక్‌సభ స్థానాల్లో 181 సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తారు.  


Also Read: Google Layoffs: ఇంకా ఆలస్యం చేసుంటే బాగా నష్టపోయేవాళ్లం, గూగుల్‌ లేఆఫ్‌లపై సుందర్ పిచాయ్‌ వివరణ