Telangana Assembly Currency Bill: తెలంగాణలో అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం శాస‌న‌స‌భ రేప‌టికి వాయిదా ప‌డింది. గురువారం ఉద‌యం 10 గంట‌ల‌కు తెలంగాణ శాసనసభ స‌మావేశం అవుతుందని స్పీక‌ర్ గ‌డ్డం ప్రసాద్ ప్రక‌టించారు. 


తొలుత ఉద‌యం 10 గంట‌ల‌కు శాసన స‌భ ప్రారంభం అయింది. వెంటనే ద్రవ్య వినిమ‌య బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చ‌ర్చ ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులను కేటీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ తప్పులను వేలెత్తి చూపారు. దీంతో రేవంత్ రెడ్డి వాటికి కౌంటర్ కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెను సబితక్కా అని సంబోధించారు. సభలో పార్టీ మార్పులపై వాడి వేడిగా చర్చ నడుస్తుండగా పెద్ద రచ్చే అయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. సబితా ఇంద్రారెడ్డి టార్గె‌ట్‌గా ఇవాళ అరగంటపాటు శాసనసభ సమావేశాలు జరగడం గమనార్హం. ఈ క్రమంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరూ కేటీఆర్ కు కౌంటర్ల వర్షం కురిపించారు.                                         


సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగం చేశారు. సబితా ఇంద్రారెడ్డిని సబితక్కా అని సంబోదిస్తూనే ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చర్చ ఉంటుంది. వ్యక్తిగతంగా జరిగిన చర్చను సబితక్క సభలో పెట్టారు. నువ్వు కాంగ్రెస్‌లోకి వస్తే ముఖ్యమంత్రిని అవుతానని సబితక్క నాకు చెప్పారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయమని నాకు సబితక్క చెప్పి ఆమె మాత్రం టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. నన్ను మోసం చేసిన సబితక్కతో జాగ్రత్తగా ఉండాలని నేను చెప్పాను. నేను చెప్పే మాట నిజమా..? కాదా..? అని సబితక్క గుండెపై చేయి వేసుకొని చెప్పాలి’ అని రేవంత్ గట్టిగానే మాట్లాడారు. ప్రసంగం ముగించిన రేవంత్.. కొత్త గవర్నర్‌ను రిసీవ్ చేసుకొని తిరిగొచ్చి మిగిలిన విషయాలు, మిగిలిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతానని బయటికెళ్లారు. ఈ క్రమంలోనే స్పీకర్ ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు. కేటీఆర్ గారు రెచ్చగొట్టడమే మన పనా..? అంటూ కోపంగా స్పీకర్ మాట్లాడారు.                


త‌న‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ స‌బిత సీఎం రేవంత్‌ను నిల‌దీశారు. ఇక సీఎం మాట‌ల‌కు భ‌ట్టి విక్రమార్క, శ్రీధ‌ర్ బాబు కూడా మద్దతుపలికారు. గంద‌ర‌గోళ ప‌రిస్థితుల న‌డుమ స‌భ‌ను ప‌ది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీక‌ర్ ప్రక‌టించారు.


మధ్యాహ్నం మళ్లీ ప్రారంభం
మ‌ళ్లీ శాసనసభ మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల స‌మ‌యంలో ప్రారంభ‌ం అయింది. స‌బితా ఇంద్రారెడ్డికి మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని బీఆర్ఎస్ స‌భ్యులు డిమాండ్ చేశారు. స్పీక‌ర్ వినిపించుకోకుండా అధికార స‌భ్యుడు గ‌డ్డం వివేక్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ స‌భ్యులు స్పీక‌ర్ పోడియంలోకి వెళ్లి నిర‌స‌న వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ద్రవ్య వినిమ‌య బిల్లును ఆమోదించుకుంది. అనంత‌రం స‌భ‌ను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీక‌ర్ ప్రక‌టించారు.