Mallu swarajyam : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, భారత కమ్యూనిస్టు పార్టీ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. నాటి రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన తుంగతుర్తి గడ్డ అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. తన జీవితాంతం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన మల్లు స్వరాజ్యం జీవితం రేపటి తరాలకు స్ఫూర్తి దాయకమన్నారు. మల్లు స్వరాజ్యం వంటి మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
తెలంగాణ చైతన్య దీపిక : రేవంత్ రెడ్డి
"మల్లు స్వరాజ్యం, గొప్ప నేత. ఆమె మరణం తెలంగాణకు తీరని లోటు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, కమ్యూనిస్టు నేత మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మరణం తెలంగాణకు తీరని లోటు. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా పేదల పక్షాన పోరాటం చేసిన తెలంగాణ చైతన్య దీపిక మల్లు స్వరాజ్యం. స్వరాజ్యం మరణం పేదలకు తీరని లోటు." అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
పేదల పక్షాన మల్లు స్వరాజ్యం పోరాటం : ఎంపీ బండి సంజయ్
తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు మల్లు స్వరాజ్యం మరణం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. సిద్దాంతాలు వేరైనా పేదల పక్షాన స్వరాజ్యం చేసిన పోరాటాలు చిరస్మరణీయమన్నారు. మల్లు స్వరాజ్యం ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు.
మల్లు స్వరాజ్యం మరణం తీరని లోటు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
స్వాతంత్య్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం అనారోగ్యంతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన వ్యక్తి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి అన్నారు. మల్లు స్వరాజ్యం మరణం తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు. మల్లు స్వరాజ్యం మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు.