ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పేసర్లలో షోయబ్ అక్తర్ ఒకడు! క్రీజులో ఎంతో మంది బ్యాటర్లను అతడు వణికించాడు. భీకరమైన బౌన్సర్లతో విరుచుకుపడేవాడు. అతడి బౌలింగ్‌ను సమర్థం ఎదుర్కొంటే మాటకు మాటా అనేవాడు. సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ వంటి బ్యాటర్లతో సై అంటే సై అనేవాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ టెస్టు సిరీసులో తలపడుతున్నాయి. కొన్నేళ్ల తర్వాత కంగారూ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. ఈ సందర్భంగా 1999లో పెర్త్ టెస్టులో రికీ పాంటింగ్‌కు వేసిన పేస్ స్పెల్‌ను షోయబ్ అక్తర్ గుర్తు చేసుకున్నాడు. పాంటింగ్ కాకుండా మరొకరు ఉంటే ఆ బ్యాటర్ తల తీసేవాడినని అంటున్నాడు. ఆ మ్యాచులో ఉద్దేశ పూర్వకంగా అతడికి భీకరమైన బౌన్సర్లు వేశానని చెప్పాడు.
'ఆ మ్యాచులో పాక్‌కు అనుకూలంగా ఏమీ జరగకపోతే ఎవరో ఒకరిని గాయపరచాలని అనుకున్నా. అందుకే ఫాస్టెస్ట్ స్పెల్ వేశాను. రికీ పాంటింగ్ నా వేగాన్ని తట్టుకోగలడో లేదో చూద్దామనుకున్నా. నా బౌన్సర్లతో అతడిని బీట్ చేయగలనో లేదో చూద్దామనుకున్నా. అంతకు ముందెప్పుడూ నేను అతడిని నా భీకర పేస్‌తో బీట్ చేయలేదు' అని అక్తర్ చెప్పాడు. ఒకవేళ అక్కడ పాంటింగ్ కాకుండా మరొకరు ఉండుంటే అతడి తల తీసేవాడినని పేర్కొన్నాడు. 'అక్కడ పాంటింగ్ కాకుండా మరొకరు ఉండుంటే అతడి తల తెగిపడేది. ఎందుకంటే నేనంత భయంకరమైన వేగంతో బంతులేశాను' అని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ గుర్తు చేసుకున్నాడు.
షోయబ్ అక్తర్ మొత్తంగా 46 టెస్టులాడి 25.7 సగటుతో 178 వికెట్లు తీశాడు. ఇక 163 వన్డేల్లో 247 వికెట్లు తీశాడు. ఎకానీ 4.76గా ఉంది. 15 టీ20లు ఆడి 19 వికెట్లు తీశాడు.