Telangana Nominations 2023 Completed: తెలంగాణలో నామినేషన్ల (Telangana Nominations) ఘట్టం ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియగా, గడువు లోపు సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయం (Returning Office)లో నామినేషన్ వేసేందుకు లైన్ లో ఉన్న అభ్యర్థులను అధికారులు అనుమతించారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన, 15 వరకూ విత్ డ్రాకు అవకాశం ఉంది. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్నాయి.  చివరి రోజున రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద కోలాహలం నెలకొంది.


చివరి రోజు భారీగా


చివర రోజైన శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం ఒక్కరోజే 1133 నామినేషన్లు దాఖలు కాగా, నిన్నటి వరకూ 2478 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. చివరి రోజు వెయ్యి వరకూ నామినేషన్లు దాఖలైనట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు, బీఫామ్ సమర్పణకు సైతం గడువు ముగిసింది. బీ - ఫామ్ సమర్పించని అభ్యర్థులను ఎన్నికల సంఘం స్వతంత్ర్య అభ్యర్థులుగా ప్రకటించనుంది. అలాగే, నామినేషన్లు వేసిన సమయంలో వందకు పైగా అభ్యర్థులు అఫిడవిట్స్ సమర్పించలేదు. వీరికి రిటర్నింగ్ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. 


2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు మొత్తం 2,644 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే, తాజా ఎన్నికల్లో ఈ సంఖ్య ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా, 3.17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 


చివరి రోజు హడావుడి


తెలంగాణ ఎన్నికల సందర్భంగా అధికార బీఆర్ఎస్ 119 నియోజకవర్గాల్లో ముందుగానే బీఫామ్స్ ఇచ్చి సన్నద్ధం చేసింది. కాంగ్రెస్ 118 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టగా పొత్తుల్లో భాగంగా ఓ స్థానాన్ని సీపీఐకు కేటాయించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ కామారెడ్డిలో నామినేషన్ వేశారు. గురువారం రాత్రి కాంగ్రెస్ తుది జాబితా విడుదల చేయగా, బీజేపీ శుక్రవారం ఉదయం అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసింది. 8 స్థానాలు జనసేనకు కేటాయించగా 111 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. కాగా, ఈ జాబితాలోనూ గందరగోళం నెలకొంది. చివరి నిమిషంలో ఇద్దరు అభ్యర్థులను మార్చింది. నామినేషన్ల దాఖలుకు మరికొద్ది సేపట్లో సమయం ముగుస్తుందనగా వేములవాడ, సంగారెడ్డి అభ్యర్థులను మార్పు చేసింది. వేములవాడ అభ్యర్థిగా మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్‌రావు, సంగారెడ్డి అభ్యర్థిగా పులిమామిడి రాజును ఆ పార్టీ ప్రకటించింది. తొలుత వేములవాడ అభ్యర్థిగా తుల ఉమ, సంగారెడ్డి అభ్యర్థిగా దేశ్‌పాండేను భాజపా ప్రకటించగా.. తాజాగా మార్పులు చేసింది. 


అటు, కాంగ్రెస్ పార్టీలో సైతం చివరి రోజు నామినేషన్లలో గందరగోళం నెలకొంది. పటాన్ చెరు కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధుకు తొలుత  టికెట్ కేటాయించగా, టికెట్ ఆశించిన కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు ఆందోళనకు దిగారు. సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సైతం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తుది జాబితాలో కాటా శ్రీనివాస్ గౌడ్ కు అవకాశం కల్పించారు. దీంతో అసంతృప్తికి గురైన నీలం మధు బీఎస్పీ తరఫున నామినేషన్ వేశారు. ఈ క్రమంలో ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నారు. ఇరు వర్గాల వారు ఒకేసారి రావడంతో వివాదం నెలకొనగా, పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన అనంతరం వెళ్లిపోయారు.


Also Read: Telangana Elections 2023 : చివరి క్షణంలో నారాయణఖేడ్ అభ్యర్థి మార్పు - సంజీవరెడ్డికి చాన్సిచ్చిన కాంగ్రెస్ !