జర్నలిస్టు, క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ మంగళవారం బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్, తెలంగాణ బీజేపీ నేతల సమక్షంలో తీన్మార్ మల్లన్న కాషాయ కండువా కప్పుకున్నారు. తీన్మార్ మల్లన్నకు తరుణ్ చుగ్ సభ్యత్వ రసీదు ఇచ్చి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు.


‘‘అమరవీరులతో మీ వీపులు పగలకొట్టిపిస్త. నాపై 38 కేసులు పెట్టినవ్. దీనివల్ల నువ్వు సాధించింది ఏం లేదు. నాపై అక్రమ కేసులు పెట్టి, పోలీసులే బయటకు పోయి కన్నీళ్లు పెట్టుకున్నరు. జడ్జిలు కూడా మదనపడ్డరు. అధికారం ఉందనే అహంకారంతో నాపై కక్ష సాధింపు చేస్తున్నవు. హుజూరాబాద్‌లో ఏమైంది? అక్కడ నీ వీపు నువ్వే పగలగొట్టుకున్నవు. నువ్వు ఏ ఐదెకరాలకాడ నీ జీవితం మొదలు పెట్టినవో.. మళ్లీ అక్కడికి తీసుకొస్తం. బీజేపీ ద్వారా నాకు ఇంకా ప్రజల్లోకి వెళ్లే అవకాశం దొరికింది. ఇక బరాబర్ ప్రజల్లోకి వస్తం. తీన్మార్ మల్లన్నపై కేసులు పెట్టినందుకు నేను బాధ పడలే. నువ్వు జర్నలిజం కుతిక మీద కత్తి పెట్టినవ్. ప్రశ్నించే గొంతుల మీద కత్తిపెట్టినవు. ఉద్యమకారులను తొక్కేస్తున్నవ్. మైహోం సిమెంటు తెచ్చి నీ రాజకీయ సమాధి కట్టకపోతే నన్నడుగు.’’ 







‘‘నేను తీసుకున్నది సభ్యత్వ రసీదు కాదు.. 15 మీటర్ల తాడు. ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్తూపానికి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావును కట్టేస్తా. అమర వీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తా. కేసీఆర్ ప్రశ్నించే నాటికి నేను ఒక్కడినే. ఇప్పుడు చాలా గొంతుకలు ఉన్నాయి. తాడు తీసుకొచ్చేందుకే నేను ఢిల్లీకి వచ్చా’’ అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేశారు.


తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. సమస్యలపై పోరాడే తీన్మార్ మల్లన్నను బీజేపీలోకి స్వాగతిస్తున్నామని అన్నారు. దేశంలో మార్పు రావాలంటే కలం ఎత్తాల్సిందేనని.. కేసీఆర్ దోపిడీ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న కలం ఎత్తారని అన్నారు. తెలంగాణ యువత రోజూ తీన్మార్ మల్లన్న లైవ్ కోసం ఎదురు చూస్తుంటారని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓట్లు సాధించారని.. ప్రజా సమస్యలపై బీజేపీ నేతలు యాత్రలు చేస్తుంటే అధికార పార్టీ దాడులు చేస్తూ, కేసులు పెడుతోందని అన్నారు.






Also Read: Vijayashanthi: అటుకులు బుక్కి ఉద్యమం చేస్తే ఇన్ని ఆస్తులు ఎట్ల వచ్చినయ్: విజయశాంతి


Also Read: TRS MPs : పార్లమెంట్ శీతాకాల సమావేశాల బహిష్కరణ.. టీఆర్ఎస్ అధికారిక ప్రకటన !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి